హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు అతిత్వరలో మరో తీపికబురు అందనున్నది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు చేసే కసరత్తు మొదలైంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పీఆర్సీ అమలుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)కు రోడ్లు భవనాలు, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు శనివారం లేఖ రాశారు.
పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని అమలు చేయాలంటూ కార్మికుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయని, ఈ విషయంలో సర్కారు తగిన నిర్ణయం తీసుకొనేలా అనుమతించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత రానున్నట్టు తెలుస్తున్నది. దీపావళి కానుకగా 5 నెలల డీఏ బకాయిలతోపాటు పెండింగ్‌లో ఉన్న 3 డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం సమ్మతించి నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
అతి త్వరలో నిర్ణయం : బాజిరెడ్డి గోవర్ధన్
ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చే విషయంలో సీఎం కేసీఆర్ అత్యంత సానుకూలంగా ఉన్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. సంస్థ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ స్వాగతించింది.
డీఏలు సహా పలు డిమాండ్ల అమలుకు రూ.100 కోట్లు మంజూరు చేయడంతోపాటు పీఆర్సీని అమలు చేసేందుకు సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నందుకు సీఎం కేసీఆర్‌కు యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ అమలుకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాయడంపై టీఎస్ఆర్టీసీ జేఏసీ సంతోషం వ్యక్తం చేసింది. ఇందుకు చొరవ తీసుకొన్న సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పువ్వాడ, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.