వనపర్తి, మార్చి 9 : వనపర్తి జిల్లాలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం వనపర్తి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాలను నిజం చేయాలని, వారి ఆకాంక్షలు, ఆశల మేరకు పని చేయాలని పిలుపునిచ్చారు. మనపై బాధ్యత పెరిగిందని, మరింత ఉత్సాహంగా పని చేయాలని పార్టీశ్రేణులను కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. గ్రామాల్లో ప్రతి చెరువు, కుంటల్లో ఉన్న ఒండ్రు మట్టిని పొలాలలకు తరలించాలని ఆదేశించారు. దీంతో భూసారం పెరగడంతోపాటు ఎరువుల వినియోగం తగ్గుతుందన్నారు.
ఈ విషయంలో వనపర్తి రైతులు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని కోరారు. మెట్టుపల్లి రైతులకు సాగునీరు అందించేందుకు త్వరలో సర్వే చేయిస్తామని పేర్కొన్నారు. తాగునీరు అందని గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వనపర్తిలో త్వరలో అతిపెద్ద రైతు సమ్మేళనం నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.