హైదరాబాద్ మే 31(నమస్తే తెలంగాణ): మిస్‌వరల్డ్-72 కిరీటం ఈసారి థాయ్‌లాండ్‌కు దక్కింది. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆ దేశ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్శ్రీ విజేతగా నిలిచింది. ఫస్ట్ రన్నరప్‌గా ఇథియోఫియాకు చెందిన హస్సెట్ డెరేజే, సెకండ్ రన్నరప్‌గా పోలాండ్‌కు చెందిన మజా కలజ్దా, నాలుగో స్థానంలో మార్టినిక్స్కు చెందిన ఔర్లి జోచిన్ నిలిచారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచిన ఓపల్ సుచాతకు ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య 71వ మిస్‌వరల్డ్ విజేత క్రిస్టినా పిజ్కోవా, సీఎం రేవంత్‌రెడ్డి, జూలియా మోర్లీ కిరీటాన్ని అలంకరించారు.
అట్టహాసంగా గ్రాండ్ ఫినాలే
మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుగుల్లో మిస్‌వరల్డ్-72 గ్రాండ్ ఫినాలే పోటీలు అట్టహాసంగా జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నిర్మాత దిల్‌రాజు, నటుడు విజయదేవరకొండ పాల్గొన్నారు. హైటెక్స్‌లో జరిగిన తుది పోటీల్లో అత్యుద్భుతంగా రూపొందించిన ర్యాంప్‌పై 108 దేశాల ప్రతినిధులు ర్యాంప్ వాక్ చేశారు. నాలుగు ఖండాలైన అమెరికా కరేబియన్, అఫ్రికా, యూరప్, ఆసియా నుంచి 10 మంది చొప్పున 40 మంది సుందరీమణులను ఎంపికచేశారు. రెండో దశలో ఒక్కో ఖండం నుంచి ఐదుగురి చొప్పున 20 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత మూడో దశలో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున 8 మందిని సెలెక్ట్ చేశారు. వీరిలో ప్రతిభాపాటవాలు, సామాజిక సేవ, సామాజిక అవగాహన తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు జడ్జిలు అడిగిన ప్రశ్నకు కచ్చితమైన సమాధానమిచ్చిన థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతశ్రీని మిస్‌వరల్డ్-72 విజేతగా ప్రకటించారు. విజేతగా నిలిచిన ఓపాల్ సుచాత చువాంగ్‌కు ప్రైజ్‌మనీ కింద రూ. 8.5 కోట్లు అందనున్నాయి.
ఆ నలుగురిలో..
ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురు కాంటినెంటల్ విజేతలను ప్రకటించారు. వీరిలో అరెలియా జోచిమ్, హస్సెట్ డేరెజ్ అడ్మసు, మాజక్లాజడ, ఓపల్ సుచాత ఉన్నారు. వీరిని జడ్జిలు ఒక్కో ప్రశ్న అడిగారు. అనంతరం ఆ నలుగురిలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈవో జులియో మోర్లె ప్రకటించారు. కాగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో సామాజిక సేవ అందిస్తూ ఆదర్శంగా నిలిచిన నటుడు సోనూసూద్‌ను ఘనంగా సన్మానించారు. హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా మిస్ వరల్డ్ బహుమతిని అందుకున్నారు. ఈ పోటీలకు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, హీరో చిరంజీవి దంపతులు హాజరయ్యారు. జడ్జీలుగా మిస్ ఇండియా మానుషి చిల్లర్, జులియో, సోనూసూద్, రానా, నమ్రతా శిరోద్కర్ వ్యవహరించారు.
మిస్‌వరల్డ్ విజేతకు సంధించిన ప్రశ్న ఇదే
ఫైనల్‌కు చేరిన నలుగురు కంటెస్టెంట్లను ఒక్కో ప్రశ్న చొప్పున అడిగారు. మిస్‌వరల్డ్ కిరీటం దక్కించుకున్న ఓపల్ శ్రీని నటుడు సోనూసూద్ ‘మీ జీవిత ప్రయాణంలో వ్యక్తిగతంగా నెరవేర్చిన బాధ్యత ఏంటి?’ అని అడగ్గా ‘మనకు ఇష్టమైన వ్యక్తులను గౌరవించడం నేర్చుకున్న. ఎంత ఎత్తుకు ఎదిగినా మనం చేసే చర్యలు అందుకు అనుగుణంగా ఉండాలి’ అని సమాధానమిచ్చింది. మిస్‌వరల్డ్-72 పోటీల్లో ప్రారంభం నుంచి ప్రతిభను చూపుతున్న మిస్ ఇండియా నందిని గుప్తా చివరి అంకంలో తడబడింది. టాప్ 10 వరకు బరిలో నిలిచిన ఆమె టాప్-8 నుంచి నిష్క్రమించింది.
మిస్‌వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్‌గా సుధారెడ్డి
మిస్‌వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్‌గా సుధారెడ్డి నియమితులయ్యారు. ఆమెకు మిస్ వరల్డ్ సీఈవో జూలీయా మోర్లీ జ్ఞాపికను అందజేశారు. గ్రాండ్ ఫినాలేకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని సుధారెడ్డి ప్రశంసించారు. మిస్‌వరల్డ్-25 హ్యుమానిటేరియన్ అవార్డును సోనూసూద్ అందుకున్నారు. కరోనా సమయంలో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు.
అద్భుతంగా వేడుకలు
మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంచొరవతో పాటు అందరి సహకారంతో మిస్ వరల్డ్ వేడుకలను ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒకరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మిస్ వరల్డ్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న పోటీదారులు, అధికారులు, అవిశ్రాంతంగా శ్రమించిన బృందా ల అంకితభావం, సమన్వయంతో కృషి చేసిన వారికి మంత్రి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.