Medaram Prasadam : ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన “సమ్మక్క సారలమ్మ జాతర’’ ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనుంది. ములుగు (వరంగల్) జిల్లాలోని మేడారంలోలో కొలువైన వనదేవతలకు బంగారం సమర్పించుకునేందుకు తండోపతండాలుగా భక్తజనం తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవల్ని ప్రారంభించింది.
మేడారంలో అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడం ఆనవాయితీ. భక్తులు ఈ బంగారాన్ని పరమపవిత్రంగా భావిస్తారు. అయితే.. వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేకపోయిన భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. అలాంటి వారికి అమ్మవారి బంగారం ప్రసాదాన్ని తమ ఇంటి వద్దకే చేర్చేందుకు తగు ప్రణాళికలు సిద్దం చేసింది. రూ.299 చెల్లిస్తే చాలు వద్దకే మేడారం అమ్మవార్ల ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇవ్వనుంది.
దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని ఇంటి వద్దకే పంపించాలని టీజీఎస్ ఆర్టీసీ భావించింది. ఈ ప్రసాదం ప్యాకెట్లో సమ్మక్క, సారలమ్మ దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వంటివి ఉంటాయి. ఈ గారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు కేవలం రూ.299/- చెల్లించాల్సి ఉంటుంది. www.tgsrtclogistics.co.in వెబ్సైట్లో లాగిన్ కావడం ద్వారా లేదంటే తమ సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ను 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చు అని టీజీఎస్ఆర్టీసీ వీసీ, ఎండీ వై.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.