హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ఆశావహులకు కేంద్రం సబ్సిడీ అందించనున్నది. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా 70-100% సబ్సిడీ మంజూరుచేయనున్నది. రైల్వే, మెట్రోస్టేషన్లు, పార్కులు, రోడ్ల సమీపంలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రైవేట్ వ్యక్తు లు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 50 కిలోవాట్స్ స్టేషన్‌కు రూ.6.04 లక్షలు, 100 కిలోవాట్స్‌కు రూ.14.80 లక్షలు, 150 కిలోవాట్స్‌కు రూ.19లక్షలు, 150పై కిలోవాట్స్‌కు రూ. 24లక్షలు వ్యయమవుతుంది.
ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేస్తే 100%, నగరాల్లో, హైవేలపై ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటు చేస్తే 80-70%, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, షాపింగ్‌మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేస్తే 80% సబ్సిడీగా ఇస్తారు. చార్జింగ్ స్టేషన్ నిర్మాణం పూర్తైన తర్వాత ఈ పథకం కింద ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుందని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన సచివాలయం సమీపంలో పర్యటించి చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించారు.