హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/లో ఫలితాలను చూసుకోవచ్చు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నది.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న టీజీపీఎస్సీ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థలు ఈ పరీక్షకు హాజరయ్యారు. ప్రాథమిక కీని జూన్ 13న విడుదల చేసిన విషయం తెలిసిందే.
కాగా, గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపికచేయాలని నిరుద్యోగులు గత కొంతకాలంగా ఉద్యమం చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో ఈ నెల 5న టీజీపీఎస్సీ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. అయినప్పటికీ పట్టించుకోని టీజీపీఎస్సీ 1:50 నిష్పత్తి ప్రాతిపదికనే అభ్యర్థులను ఎంపికచేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా తమ వినతిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు గందరగోళ పరిస్థితుల్లో పడ్డారు. ఇదే జరిగితే ఇక ఉద్యమాలను ఉదృతం చేయడం తప్ప మరో దారి కనిపించడం లేదన్న అభిప్రాయానికి నిరుద్యోగులు వచ్చినట్టు తెలుస్తున్నది. 1:100 నిష్పత్తి అమలు చేస్తే, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే ఇది అవాస్తవమే అని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 నిష్పతి అమలు కోసం తీసుకొచ్చిన జీవో 29ని సవరించాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందంటున్నారు. అందరికీ న్యాయం జరగాలంటే గతంలో మాదరిగా జీవో 55ను అమలు చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 2లో 2 వేలు, గ్రూప్ 3లో మూడు వేల పోస్టుల సంఖ్యను పెంచుతూ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఈ విషయంలో నూ న్యాయపరమైన చిక్కులు వస్తాయంటూ మం త్రులు చెప్పడం హస్యాస్పదమని న్యాయనిపుణు లు అభిప్రాయపడుతున్నారు. అదనపు పోస్టులు పెంచుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భాలు కమిషన్ చరిత్రలో అనేకం ఉన్నాయని, ఈ విషయాన్ని మరిచిపోవద్దని నిపుణులు గుర్తు చేస్తున్నారు. డీఎస్సీ పరీక్ష వాయిదాకూ అభ్యర్థులు పట్టుబడుతున్నారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 4 వరకు డీఎస్సీ పరీక్షలు ఉండగా, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉంటే ఎలా ప్రిపరేషన్ కావాలంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.