హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దడమా? లేక మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించడమా? ఇది ఇప్పుడు టీజీపీఎస్సీ ముందున్న అతిపెద్ద సవాల్. ‘మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దండి.. లేదా పరీక్షలు పెట్టండి’ అంటూ హైకోర్టు తాజా తీర్పుపై ఈ సంశయం నెలకొన్నది. టీజీపీఎస్సీ నిబంధనలు రూల్-3 (9) (డీ) ప్రకారం రీవాల్యుయేషన్‌కు ఆస్కారమే లేదు. హైకోర్టు మాత్రం పున:మూల్యాంకనం చేయాలని తీర్పునిచ్చింది. ఒకసారి మూల్యాంకనం చేశాక, మరోసారి చేయవచ్చా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మెయిన్స్‌ను రద్దు చేయడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. యూపీఎస్సీ కూడా రీ వాల్యుయేషన్ చేయడంలేదని, టీజీపీఎస్సీ కూడా రీ వాల్యుయేషన్ చేస్తే కొత్త చిక్కులు కొని తెచ్చకున్నట్టేనని వారు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. రీ వాల్యుయేషన్ చేస్తే మళ్లీ కేసులు, వివాదాలు ముసిరే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా పరీక్షలను రద్దుచేయడమే శ్రేయస్కరం అని, మాడరేషన్ అంత సులభంకాదని నిపుణులు సూచిస్తున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాలను రీ వాల్యుయేషన్ చేయడం సులభమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను దాదాపు 21 వేల మంది అభ్యర్థులు రాశారు. ఒక్కో అభ్యర్థి 7 పేపర్ల చొప్పున పరీక్షలు రాశారు. అంటే దాదాపు 1.47లక్షల సమాధాన పత్రాలు ఉంటాయి. కమిషన్ నిబంధనల ప్రకారం జవాబుపత్రాలను ఇద్దరు వాల్యుయేటర్ల చేత మూల్యాంకనం చేయించారు. ఆ తర్వాత మార్కుల్లో 15 శాతం తేడాలుంటే మూడోసారి మూ ల్యాంకనం చేయించారు. ఒకవేళ మళ్లీ మూల్యాంకనం చేసినా గతంలో వేసిన మార్కుల ప్రభావం పడుతుందని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మార్కుల్లో పెద్ద తేడా ఉండదని, మళ్లీ అన్యాయమే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బధవారం ప్రత్యేకంగా భేటీ కానున్నది.
హైకోర్టు తీర్పులో మాడరేషన్ అన్న పదాన్ని వినియోగించింది. జవాబుపత్రాల మూల్యాంకనంలో వివక్షకు తావు లేకుండా రాసిన జవాబు పత్రాలను ప్రామాణికంగా తీసుకుని సమాన న్యాయం చేయడమే మాడరేషన్. తెలుగు, ఇంగ్లిష్ అన్న తేడాల్లేకుండా సమన్యాయం చేయడమే ఈ పద్ధతి ముఖ్య ఉద్దేశం. సహజంగా మూల్యాంకనంలో ఒక్కో వాల్యుయేటర్ ఒక్కో రకంగా మార్కులు వేస్తారు. ఈ క్రమంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం వారిలో ఎవరో ఒకరికి అన్యాయం జరుగుతుంది. ఇలాంటి అన్యాయానికి తావులేకుండా రాసిన కంటెంట్ ఆధారంగా మార్కులేయడమే మాడరేషన్ అని నిపుణులు చెప్తున్నారు.