రామగిరి, జూన్ 8: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ‘టీజీఐసెట్-2025’ ప్రవేశ పరీక్ష తొలిరోజైన ఆదివారం సజావుగా ముగిసింది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో మూడు సెషన్లలో ‘టీజీఐసెట్-2025’ నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సెషన్-1లో నిర్వహించిన పరీక్షకు 24,330 మందికి 21,897 మంది (90%) విద్యార్థులు హాజరయ్యారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్-2లో నిర్వహించిన పరీక్షకు 24,330 మందికి 22,136 మంది (90.98%) విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం ఉదయం జరగాల్సిన సెషన్-3తో టీజీ ఐసెట్ ముగుస్తుంది. నల్లగొండలో సెట్ చైర్మన్ ఖాజా అల్తాఫ్హుస్సేన్, హైదరాబాద్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరిశీలించారు. జూలై 7న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.