హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పుకుందామంటే పోలీసులు ఆంక్షల పేరుతో వేధించడమేంటని తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్స్ (టీజీఏపీటీయూ) నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంక్షల పేరుతో ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం టీజీఏపీటీయూ మంగళవారం ఉదయం 10 గంటలకు మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఈ మేరకు బీఎంఎస్, టీఎన్టీయూసీ, జేఎస్పీటీయూ, బీపీటీఎంఎం, టీఆర్ఏకేటీయూ, టీఏడీ యూ, ఎన్టీఏడీయూ, జీహెచ్ఎస్వీడీయూ తదితర సంఘాలన్నీ మహాధర్నా నిర్వహించి సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్దామని భావించాయి. కానీ, నగరంలో 163 సెక్షన్ విధించడంతో ధర్నా సాధ్యం కాదని భావించి వాయిదా వేసినట్టు యూనియన్ ప్రకటించింది. రేవంత్రెడ్డి ప్రభుత్వంలో వాహనరంగ కార్మికులు నరకం చూస్తున్నారని మండిపడింది.