TG Weather Update | తెలంగాణలో మరో రెండురోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని పేర్కొంది. కోస్తాంధ్ర, యానాం, మధ్య ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని చెప్పింది. ఈ క్రమంలో తెలంగాణలో రాబోయే రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, పలుచోట్ల ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరుగుతాయని పేర్కొంది.
ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరో వైపు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వడగాలులు వీస్తాయని.. ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వివరించింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.