TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని.. దీని ప్రభావంతో బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య దిశగా కదులుతూ 24 ఉదయం నాటికి బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఇంటరీయర్ కర్ణాటక వరకు రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మంగళవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. 22న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అలాగే 25వ వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.