TG Weather | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేను జంకుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. రాగల మూడునాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. రాగల 24గంటల్లో బంగాళాఖాతంలో వాయువ్య దిశగా పయనించనున్నది.
అనంతరం 48గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మంగళవారం, బుధవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే, ఈ నెల 13 వరకు రాష్ట్రంలో పలుచోట్ల అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.