TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తం కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా సముద్రమటానికి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. అలాగే గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది.
శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 24 వరకు పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గడిచి 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాపాతం రికార్డయ్యింది.