హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిపై వేటు వేసేందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిరాకరించారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, వారు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు చెప్పారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని.. బీఆరెస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, చింతా ప్రభాకర్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్‌లో వాదనలు పూర్తయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2:30కు స్పీకర్ తీర్పు వెలువరించారు.
గతంలో కూడా ఐదుమంది ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటూ అధికారంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆరెస్ కోరుతోంది. కానీ సాంకేతికంగా ఆధారాలు లేవని పేర్కొంటూ స్పీకర్.. బీఆరెస్ ఎమ్మెల్యేల పిటిషన్లను డిస్మిస్ చేస్తూ వస్తున్నారు.