హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): అయ్యన్న ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ అక్రమాలకు టీజీ రెరా కళ్లెం వేసింది. కొనుగోలుదారులతో కుదుర్చుకున్న సేల్ అగ్రిమెంట్‌ను ఆ సంస్థ ఏకపక్షంగా రద్దు చేయడం కుదరదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. శేరిలింగంపల్లి వద్ద 12 అంతస్తుల భారీ అపార్టుమెంట్ నిర్మాణాన్ని చేపట్టిన అయ్యన్న ఇన్ఫ్రా కంపెనీ.. ఒక్కో ఫ్లాట్‌ను 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి ఇస్తామమంటూ ప్రీలాంచ్ విక్రయాలకు దిగింది.
ఆ ఫ్లాట్లను కొనుగోలు చేసినవారికి 105 గజాల చొప్పున యూడీఎస్ (అన్ డివైడెడ్ స్పేస్)తో పాటు మూడు కార్లకు సరిపోయే పార్కింగ్ స్థలాన్ని ఇస్తామని నమ్మించింది. అలా హైదరాబాద్‌కు చెందిన వనజ అనే మహిళ పలు దఫాలుగా ఆమె మొత్తం రూ.3.62 కోట్లు చెల్లించి నాలుగేండ్లు గడిచినప్పటికీ ఫ్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయకుండా మోసగిం చింది. ఆమెతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ రద్దు చేస్తున్నామంటూ ఆమె భర్త మోహన్‌రావుకు మెయిల్ ద్వారా సమాచారం అందించింది.
అనుకున్న సమయానికి వనజ వాయిదాలు చెల్లించకపోవడం వల్లనే అగ్రిమెంట్‌ను రద్దు చేశామని, ఆమె చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని మినహాయించుకుని మిగిలిన డబ్బులను వాపసు ఇస్తామని చెప్పి జారుకునే ప్రయత్నం చేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన వనజ తన వద్ద ఉన్న రశీదులతో రెరా కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన రెరా.. బాధితురాలితో అయ్యన్న ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ కుదుర్చుకున్న సేల్ అగ్రిమెంట్ రద్దయినట్టుగా గుర్తించడం లేదని స్పష్టం చేసింది. ఆమెకు కేటాయించిన 601 ఫ్లాట్‌తోపాటు కార్ పార్కింగ్ స్థలాన్ని, ఉమ్మడి స్థలాన్ని ఆమె పేరిటే రిజిస్ట్రేషన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.