హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(పీజీఈసెట్) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్‌కుమార్ ఫలితాలు విడుదల చేశారు. మొత్తంగా 3,298 మంది దరఖాస్తు చేసుకోగా, 2,449 మంది పరీక్షలకు హాజరయ్యారు. 2,310(94.32%) మంది క్వాలిఫై అయ్యారు. అయితే పురుషులు స్వల్ప ఆధిక్యత కనబరిచారు.
బీపీఈడీలో పురుషులు 94.17%, మహిళలు 93.99% క్వాలిఫై కాగా, యూజీ డీపీఈడీలో పురుషులు 95.39%, మహిళలు 94.21% పాసయ్యారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఎస్కే మహమూద్, ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, పీజీఈసెట్ కన్వీనర్ రాజేశ్‌కుమార్, ప్రొఫెసర్ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 17 బీపీఈడీ కాలేజీలుండగా 1,760 సీట్లు, 3 యూజీ డీపీఈడీ కోర్సులుండగా 300 సీట్లున్నాయి.
