IAS Officers | డీవోపీటీ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. డీవోపీటీ ఉత్తర్వులను నిలిపివేసేందుకు క్యాట్ నిరాకరించిన విషయం విధితమే. అధికారుల పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు క్యాట్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరింది. అయితే, తమకు ఇంకా ఆర్డర్ కాపీ రాలేదని అధికారుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఐఏఎస్‌ల పిటిషన్లను క్యాట్ అడ్మిట్ చేసుకుందని.. ట్రైబ్యునల్‌లో నవంబర్ 4న విచారణ జరుగనున్నదని చెప్పారు.
అయితే, నవంబర్ 4వ తేదీ వరకు రిలీవ్ చేయొద్దని కోరారు. రిలీవ్ చేసేందుకు 2 రాష్ట్రాలు డీవోపీటీని గడువు కోరాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రిలీవ్‌కు 15 రోజులు గడువు ఇవ్వాలని డీవోపీటీని కోరాయని చెప్పారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. స్టే ఇస్తూ వెళ్తే.. ఈ అంశం ఎన్నటికీ తేలదన్నారు. వివాదాన్ని తేలుస్తామని.. ముందైతే కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలన్న హైకోర్టు సూచించింది. బాధ్యతాయుతమైన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దని చెప్పింది. మరోసారి పరిశీలించాలని డీవోపీటీని ఆదేశించమంటారా?.. సమాఖ్య దేశంలో రాష్ట్రాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా? అంటూ ప్రశ్నించింది. పిటిషన్లపై డీవోపీటీ, అధికారుల తరఫున న్యాయవాదుల వాదనలు వినిపించారు. ప్రస్తుతం కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. మరికొద్దిసేపట్లో తీర్పును వెల్లడించే అవకాశం ఉన్నది.