హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి సోమవారం నుంచి వెబ్ కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నట్టు సాంకేతిక విద్య కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీ ఎప్‌సెట్)లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ర్యాంక్‌ల ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.
ఈనెల 1నుంచి శనివారం వరకు ఎప్‌సెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల్లో 95,654మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోగా, ఇప్పటివరకు 76,494మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినట్టు పేర్కొన్నారు. అయితే, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈనెల 8 తుది గడువు అని వెల్లడించారు. అభ్యర్థులు 10లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చునని తెలిపారు. 13న మాక్ సీట్ అలాట్మెంట్, 18న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు.