EAPCET | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించే అవకాశముంది. ఇంజినీరింగ్‌కు మూడు రోజులు, ఫార్మసీ, అగ్రికల్చర్‌కు రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సారి కూడా ఎప్‌సెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకే అప్పగించారు.
జేఎన్టీయూ ప్రొఫెసర్ డీన్‌కుమార్‌ను పరీక్ష కన్వీనర్‌గా ఉన్నత విద్యామండలి నియమించింది. కేవలం పరీక్షల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ వర్గాలతో ఉన్నత విద్యామండలి సంప్రదింపులు జరుపుతున్నది. మే రెండో వారంలో ఎప్‌సెట్ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయానికొచ్చారు. పరీక్షా తేదీలను ఖరారుచేసి, పూర్తి షెడ్యూల్‌ను జనవరిలో ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షలు పూర్తయ్యాకే ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గే అవకాశాలున్నాయి.
జేఈఈ మెయిన్-2 పరీక్షలు ఏప్రిల్ ఆఖరులో జరగనున్నాయి. అంటే జేఈఈకి ఎప్‌సెట్‌కు మధ్య వ్యవధి 10-15 రోజులే ఉండనుంది. ఇంటర్ పరీక్షలు మార్చి 20తో ముగుస్తాయి. ఇంటర్ పరీక్షల నుంచి ఎప్‌సెట్‌కు మధ్య వ్యవధి 45 రోజులుంటుంది. దీంతో ప్రిపరేషన్‌కు సరిపోయేంత సమయమిచ్చినట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే బిట్‌శాట్ పరీక్ష సైతం మేలోనే జరగనుంది.
ఈ పరీక్ష అడ్డంకిరాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిగిలిన ప్రవేశ పరీక్షలైన ఐసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, ఈసెట్ వంటి పరీక్షలను సైతం మే మాసంలోనే నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సిటీలు, కన్వీనర్ల ఎంపిక పూర్తికాగా, ఈ ఆరు ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్‌ను సైతం జనవరిలో ఖరారుచేసే అవకాశాలున్నాయి.