పెద్దకొత్తపల్లి, నవంబర్ 11 : పాఠ్యపుస్తకాలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తాపడి ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు ఐదుగురు బొలెరో వాహనంలో పార్ట్-2కు చెందిన పాఠ్యపుస్తకాలను తీసుకొచ్చేందుకు మంగళవారం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రానికి వెళ్లారు. అక్కడ పుస్తకాలు తీసుకున్నాక తిరుగు ప్రయాణంలో బాచారం-జొన్నలబొగుడ స్టేజీ సమీపంలో వాహనం ముందు టైర్ పేలడంతో ఒక్కసారిగా బోల్తా పడింది.
దీంతో విద్యార్థులు నాని, నందు, చరణ్‌తేజ, కార్తీక్శివ, ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నారు. శివ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కలెక్టర్ సంతోష్‌తో ఫోన్లో మాట్లాడి ఘటనకు కారణాలను అడిగి తెలుసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీశ్‌కుమార్ తెలిపారు. సాతాపూర్ పాఠశాల హెచ్ఎం శ్రీశైలంను సస్పెండ్ చేసిన డీఈవో ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డికి షోకాజ్ నోటీసును జారీ చేశారు.