TG TET | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : టెట్ పరీక్ష నిర్వహణలో విద్యాశాఖ ఘోరంగా విఫలమైంది. శనివారం నిర్వహించిన టెట్ పరీక్షలో ఓ సెంటర్లో సాంకేతిక సమస్య తలెత్తి సర్వర్‌డౌన్ కావడంతో పరీక్ష మధ్యలో నిలిచిపోయింది. పది నిమిషాల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పుకుంటూ నిర్వాహకులు కాలం వెలిబుచ్చారు. ఫలితంగా రాత్రి వరకు అభ్యర్థులు సెంటర్లోనే నిరీక్షించారు. పరీక్షకు వెళ్లిన వారు బయటికిరాకపోవడం, ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు టెన్షన్‌పడ్డారు. కంగారుతో ఫోన్లు చేసినా.. అవి బయటే ఉండి స్పందించకపోవడంతో ఏం జరిగిందోనన్న ఆందోళన కనిపించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి వచ్చిన ఓ మహిళా అభ్యర్థి పిల్లలతో సహా పరీక్షకు హాజరుకాగా, ఆకలితో నకనకలాడల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ నర్కుడ గ్రామ సమీపంలోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం పేపర్-2 గణితం, సైన్స్(తెలుగు మీడియం) పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష జరగాల్సి ఉంది. మధ్యాహ్నం 3గంటలకు సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తి, పరీక్ష నిలిచిపోయింది. పది నిమిషాల్లో సమస్యను పరిష్కరిస్తామని నిర్వాహకులు చెప్పగా.. ఎంతకు పరిష్కారం కాకపోవడంతో అభ్యర్థులు సెంటర్లో ధర్నాకు దిగారు. ఎట్టకేలకు రాత్రి 6:30కు పరీక్ష తిరిగి ప్రారంభమైంది. దీంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదే విషయంపై ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్‌ను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో సంప్రదించగా, ఆయన ఎంతకు స్పందించలేదు.