హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ దిగువ వైపున కూడా సాంకేతిక పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బరాజ్‌లోని అన్ని బ్లాకుల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్‌లోని 20 పి ల్ల ర్ కుంగుబాటుకు కారణాలను తెలుసుకొనేందుకు తొలుత ఇంజినీరింగ్ అధికారులు బరాజ్ ఎగువన ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను నిర్వహించారు. బరాజ్‌లోని అన్ని బ్లాకుల్లో తొలుత విద్యుత్తు నిరోధకరత ఆధారంగా భూగర్భ పరీక్షలు నిర్వహించారు. అనంతరం భూగర్భ భౌతిక స్థితిని తెలుసుకొన్నారు. ఇక ఇప్పుడు బరాజ్ దిగువవైపున కూడా ఈ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే నిర్వహించిన పరీక్షల నివేదికను పరిశీలించి, బరాజ్ కుంగుబాటుకు కచ్చితమైన కారణాలను తేల్చేందుకు ప్రత్యేక నిపుణులను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.