బొల్లారం, ఆగస్టు 24 : మిద్దె తోట వ్యవసాయం ఆరోగ్య ప్రదాయిని అని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ హర్కర చెప్పారు. హైదరాబాద్ పరిధి తిరుమలగిరిలోని జయలక్ష్మి గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరించే మిద్దె తోట పెంపకందారులకు వివిధ రకాల కూరగాయాలు, పూల మొక్కలను పంపిణీ చేసినట్టు తెలిపారు.
వంగ, టమాటతో పాటు పలురకాల పూల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్టు వెల్లడించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు ఇంటిలోనే అవసరమైన కూరగాయలను పండించుకునే ఈ పద్ధతిని మరింత విస్తృతం చేయాలని కోరారు. మొక్కల ఎదుగుదలకు వాడే ద్రవాలను ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. సంస్థ కో-ఫౌండర్ సరోజతో కలిసి మట్టి వినాయక విగ్రహలను పంపిణీ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): విలక్షణమైన తెలుగువారి సంస్కృతికి దేవాలయాలు నిలయాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శాతవాహనుల కాలం నుంచి విజయనగర పాలకుల తర్వాతి కాలం వరకు వివిధ శైలిలో నిర్మించిన ఆలయాలు విద్య, వైద్యం, కళలకు కాణాచిగా బహుముఖ పాత్రలను పోషించాయని చెప్పారు. చికాగో సాహితీ మిత్రులు, షికాగో ఆంధ్ర అసోసియేషన్, లేమాంట్లోని హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో, గుప్తాహాలులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఏపీలోని ఆలయ నిర్మాణవికాసం గొప్పగా సాగిందని చెప్పారు. తెలంగాణలో 1వ శతాబ్దిలో బ్రిడ్జ్ రంగాపూర్ వద్ద శివాలయం, 3వ శతాబ్దిలో ఆలయాలు నాగార్జునకొండ వద్ద, 4వ శతాబ్దం నాటి చేజర్ల, పెద్దవేగి, గుమ్మడం, 5వ శతాబ్ది నాటి కీసరగుట్ట శివాలయాలు ఇటుకలతో నిర్మించారని వివరించారు.
బాదామి చాళుక్యులు అలంపురంలో, వేంగి చాళుక్యులు 6వ శతాబ్దిలో రాతితో ఆలయాలు నిర్మించారని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విలక్షణ వాస్తు విన్యాసం, శిల్పకళతో ఆలయాలు నిర్మించి, సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దారని చెప్పారు. అనంతరం చికాగో సాహితీ మిత్రులు సంస్థ కార్యదర్శి, అధ్యక్షుడు జయదేవ్ మెట్టుపల్లి, శ్రీకృష్ణ మతుకుమల్లి, తానా మాజీ అధ్యక్షుడు జంపాల దరి, అంతర్జాతీయ చిత్రకారుడు, పద్మశ్రీ డాక్టర్ ఎస్వీ రామారావు, చికాగో ఆంధ్ర అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ పెద్దమల్లు, ప్రతినిధులు తమిస్ర కొచ్చాడ, రాఘవ జట్ల, నర్సింహారెడ్డి ఒగ్గు, సునీత రాచపల్లి, శ్రియ కొంచాడ తదితరులు శివనాగిరెడ్డిని ఘనంగా సతరించారు.