హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలలో సర్కార్ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్‌ను ఖరారు చేయడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలుపలేదు. దీంతో ఇంకా షెడ్యూల్ విడుదలకాలేదని తెలుస్తున్నది. మార్చి మూడో వారంలో పదోతరగతి పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు షెడ్యూ ల్ రూపొందించారు. రెండు రకాల షెడ్యూల్స్ రూపొందించి విద్యాశాఖకు పంపించారు. సంబంధించిన ఫైల్ సీఎంవోకు చేరింది. ఈ ఫైల్‌కు ఇంకా సీఎం ఆమోదం తెలుపలేదు. ఈ షెడ్యూల్‌కు ‘సీఎం ఆమోదం తెలిపేదెన్నడు.. షెడ్యూల్ విడుదలయ్యేదెన్నడు’ అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది. గ్లోబల్ సమ్మిట్, ప్రజాపాలన సంబురాల్లో బిజీగా ఉన్న సీఎం ఈ విషయంపై దృష్టిపెట్టలేదు. దీంతో పరీక్షల షెడ్యూల్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలై నెల దాటింది. పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు అక్టోబర్ 31న విడుదల చేసింది. సహజంగా ఇంటర్ షెడ్యూల్‌ను బట్టే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రూపొందిస్తారు. ఈ షెడ్యూల్ వచ్చిన వారం రోజుల్లోపు పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలవుతుంది. ఇంటర్ షెడ్యూల్ విడుదలై ఇప్పటి వరకు ఐదు వారాలు గడిచిపోయాయి. కానీ ఇంతవరకు పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.
ఈ సారి పరీక్ష తేదీల షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. పరీక్షకు.. పరీక్షకు మధ్య ఒకట్రెండు రోజులు విరామం ఇవ్వనున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్ఈ పరీక్షల్లోనూ ఇదే తరహా వ్యవధి ఇస్తున్నారు. దీంతో మన దగ్గర సైతం ఇదే పద్ధతి అనుసరించాలని నిర్ణయించారు. కొన్ని పరీక్షలకు ఒక రోజు.. మరికొన్ని పరీక్షలకు రెండు రోజుల గ్యాప్ రానున్నది. అయితే పరీక్షల మధ్యలో రంజాన్, ఉగాది, మహావీర్ జయంతి, శ్రీరామనవమి వంటి పండుగలు రానున్నాయి. దీంతో కొన్ని పరీక్షలకు మూడు, నాలుగు రోజులు గ్యాప్ ఉండనున్నది.