భూపాలపల్లి రూరల్, నవంబర్ 22: మున్సిపల్ కార్మికుడి మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు చేపట్టి ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట చోటుచేసుకున్నది. భూపాలపల్లి పట్టణానికి చెందిన బొల్లి రాజయ్య (50) మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
శనివారం ఉదయం శానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీన్ మెషిన్‌తో చెట్లను కట్ చేయాలని రాజయ్యను బలవంతంగా పంపించారు. చెట్లను కట్‌చేస్తూ రాజయ్య కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే దవాఖానకు తరలించగా, డాక్టర్లు పరీక్షించి రాజయ్య చనిపోయాడని తెలిపారు. బీఆర్ఎస్, సీపీ ఐ, సీపీఎం, ధర్మసమాజ్వాది పార్టీల నాయకులు, మృతుడి కుటుంబ సభ్యులు రాజయ్య మృతదేహంతో పక్కనే ఉన్న కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లారు. పోలీసులు లాఠీచార్జిచేయగా పదిమందికి గాయాలయ్యా యి. అనంతరం కార్మిక సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో బైఠాయించి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.