చిక్కడపల్లి, జూలై15 : ప్రశాంతంగా ఉండే చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ సోమవారం రాత్రి రణరంగాన్ని తలపించింది. నిరుద్యోగుల ఆందోళనలు, పోలసుల అరెస్టులతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గ్రూప్-2,3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ తీస్తామని పోలీసులను కోరినా నిరాకరించారు. ప్రధాన గేటు దాటి బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. లైబ్రరీ నుంచి బయటకు వచ్చేందుకు యత్నించిన 20 మందిని అరెస్టు చేసి చాంద్రాయణగుట్ట, బొల్లారం పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిలో ఇద్దరు మహిళా అభ్యర్థులున్నారు.
అభ్యర్థుల్లో భయంభయం
ఓవైపు గేటు బయటకు వెళ్తున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేస్తుంటే మరోవైపు లోపల ఉన్నవారు ఆందోళన కొనసాగించారు. గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలని, డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ‘సీఎం డౌన్‌డౌన్’, ‘గుంపు మేస్త్రీ డౌన్ డౌన్’ అంటూ గర్జించారు. దీంతో పోలీసులతో పాటు స్పెషల్ టీం పోలీసులు గేటు లోపలికి వెళ్లి నిరసనకారులను అరెస్ట్ చేశారు.
పోలీసులు దూసుకురావడంతో అభ్యర్థులు భయభ్రాంతులకులోనై లోపలికి వెళ్లి లైబ్రరీ భవనం గ్రిల్ వేసుకున్నారు. లైబ్రరీలోనికి పోలీసులు ఎలా వస్తారని నిలదీశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో అభ్యర్థులు భోజనం చేసేందుక అనుమతించారు. బయటకు వెళ్తున్నవారిలో ఆందోళన చేస్తున్న వారిని గుర్తించి అరెస్టు చేశారు.

జర్నలిస్ట్ అరెస్టు
సిటీ సెంట్రల్ లైబ్రరీ బయట యూట్యూబ్ చానల్ జర్నలిస్ట్ మహిపాల్ యాదవ్ కవరేజ్‌లో భాగంగా అభ్యర్థులతో మాట్లాడుతుంటే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను రిపోర్టర్నని చెప్పినా వినిపించుకోలేదు. ఈ విషయంపై వివిధ చానళ్ల ప్రతినిధులు ఇన్స్పెక్టర్ను అడుగగా ‘మా పనికి అడ్డు వచ్చిన వారిని అరెస్టు చేస్తాం’ అని దురుసుగా సమాధానమిచ్చారు.
నియంతృత్వ ధోరణి నశించాలి: జంగయ్య
కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణి నశించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి వీ జంగయ్య మండిపడ్డారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి ఓట్లు దండుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకుని.. ఇప్పుడు కనీసం వారితో మాట్లాడే ఆలోచనలో కూడా లేని దౌర్భాగ్యపు స్థితిలో ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. నిరుద్యోగులు ఇంత ఆందోళన చేస్తున్నా దున్నపోతుమీద వాన పడ్డట్టు వ్యవహరించడం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు.