జహీరాబాద్, ఏప్రిల్ 18: నిమ్జ్ కోసం సేకరించిన భూముల్లో కడీలను పాతేందుకు వచ్చిన అధికారులను బాధిత రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని అందించిన తర్వాతే తమ భూములను స్వాధీనం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ముంగి గిరిజన తండావాసులు స్పష్టంచేశారు. తండా సమీపంలో నిమ్జ్ కోసం సేకరించిన భూముల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది కడీలను పాతి ఫెన్సింగ్ వేసే పనులు శనివారం చేపడుతుండగా తండాకు చెందిన బాధిత రైతులు, కూలీలు అడ్డుకున్నారు. సారవంతమైన భూముల్లో రెండు, మూడు పంటలను పండించుకుని జీవనాన్ని సాగిస్తున్నామని తెలిపారు. నిమ్జ్ ప్రాజెక్టు కోసం ఈ భూములు తీసుకుని ఎకరాకు కేవలం రూ.5.60 లక్షలు మాత్రమే పరిహారం చెల్లించడం తగదని అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం తమ భూములకు మెరుగైన పరిహారాన్ని చెల్లించాలని, భూములపై ఆధారపడిన రైతులు, కూలీలకు పునరావాసంతోపాటు, భూములు కోల్పోయిన బాధిత రైతులకు 125 గజాల ఇంటి స్థలం, ఇండ్లు, తమ భూముల్లో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలను కల్పించాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశామని, కోర్టు తీర్పు వచ్చే వరకు తమ భూములను స్వాధీనం చేసుకోవద్దని రైతులు సంబంధిత అధికారులతో మొరపెట్టుకున్నారు.
అయినప్పటికీ అధికారులు పోలీసులతో బలవంతంగా భూములను స్వాధీనం చేసుకునేందుకు కదిలారు. భూముల్లో సాగు చేసిన పంటలను జేసీబీతో దున్ని వేసి, కడీలను పాతి ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నిస్తుండగా, బాధిత రైతులు, తండావాసులు అడ్డుకున్నారు. భూములను స్వాధీనం చేసుకోవద్దని కొందరు బాధిత రైతులు, మహిళలు జేసీబీలకు అడ్డంగా పడుకున్నారు. పనులను అడ్డుతగలకుండా పోలీసులు వారిని నిలువరించే క్రమంలో తోపులాట జరగడంతో తండాకు చెందిన చాందీబాయి అనే మహిళ సొమ్మసిల్లి కింద పడిపోయింది. వెంటనే పోలీసులు ఆమె చికిత్స నిమిత్తం 108 వాహనంలో నారాయణఖేడ్ దవాఖానకు తరలించారు. తండాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, డీఎస్పీ సైదనాయక్ అదనపు పోలీసు బలగాలతో అక్కడి చేరుకుని తండావాసులతో మాట్లాడారు. బా ధితుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి పనులు, భూములను స్వాధీనం చేసుకోవద్దని బాధిత రైతులు, తండావాసులు మొరపెట్టుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య భూముల్లో కడీలు పాతి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.