దళిత రైతులపై సర్కార్ దౌర్జన్యం
దళిత రైతులపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి దాష్టీకం ప్రదర్శించింది. వారి భూములను లాక్కొనేందుకు దౌర్జన్యానికి దిగింది.
- పోలీస్‌పహారాలో 18 ఎకరాల భూమికి ప్రహరీ నిర్మాణ పనులు
- అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి అక్రమంగా బాధిత రైతుల అరెస్టు
- హయత్‌నగర్ అన్మగల్లో ఉద్రిక్తం
హయత్‌నగర్, అక్టోబర్ 24: దళిత రైతులపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి దాష్టీకం ప్రదర్శించింది. వారి భూములను లాక్కొనేందుకు దౌర్జన్యానికి దిగింది. 200 మంది పోలీసుల పహారాలో అర్ధరాత్రి దళితుల ఇండ్లలోకి జొరబడిన అధికారులు బీభత్సం సృష్టించారు. బాధిత రైతులను అరెస్టు చేయడంతోపాటు అడ్డొచ్చిన వారి కుటుంబ సభ్యులనూ అదుపులోకి తీసుకొని నాగోల్ తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకు న్న ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
హయత్‌నగర్ మండల రెవెన్యూ పరిధిలోని అన్మగల్ గ్రామ పరిధిలోని సర్వే నం.255/1 లోని 18 ఎకరాల్లో గత 70 ఏండ్లుగా పలువురు దళిత రైతులు వ్యవసాయం చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం.. వారిపట్ల కర్కశంగా వ్యవహరించింది. ఇబ్రహీంపట్నం ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, హయత్‌నగర్ తహసీల్దార్ జానకి ఆధ్వర్యంలో ఏడుగురు సీఐలు, 16 మంది ఎస్సైలు, 150 మంది స్పెషల్ పోలీసుల పహారాలో బాధిత రైతుల భూములను బలవంతంగా లాక్కొని ఫ్రీకాస్టింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.
ప్రహరీ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు వెళ్తున్న బాధిత రైతుల కుటుంబసభ్యులనూ అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబురావు, డీఈ పావని, ఏఈ నవీన్, వనస్థలిపురం ఏసీపీ కరుణాకర్, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ చింత శంకరయ్య, డీఐ సంతోష్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ అనిల్‌కుమార్, రెవెన్యూ అధికారులు రమేశ్, రవికుమార్, జూనియర్ అసిస్టెంట్ వీరన్న, జీపీవోలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
‘దళిత రైతులపై దౌర్జన్యం’
గత 70 ఏండ్లుగా సాగుచేసుకుంటున్న దళిత రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్, బీజేపీ, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. తమ భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నించిన దాదాపు 30 మంది నిరుపేద దళిత రైతులను అర్ధరాత్రి అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించడం సరైంది కాదని మండిపడ్డారు. ‘ఇందిరమ్మవ రాజ్యం’ అంటే పేద దళితుల పొట్టలు కొట్టడమేనా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నదాతల కన్నీళ్లను తుడువాల్సిన ప్రభుత్వమే పోలీస్ బలంతో బాధిత రైతుల కుటుంబ సభ్యులను సైతం ఈడ్చుకెళ్లడం ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుపడే విధంగా ఉన్నదని విమర్శించారు. న్యాయంకోసం ప్రశ్నించి ప్రతి గొంతును అణచివేయాలని చూస్తే ప్రజలు త్వరలోనే కాంగ్రెస్‌కు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను తక్షణమే వదలాలని, దళిత రైతులకు పూర్తి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భూములు గుంజుకుంటే బతికేదెట్లా?
70 ఏండ్ల కిందట ఇందిరమ్మ ఉన్నప్పుడే మాకీ భూములను ఇచ్చిండ్రు. ఇపుడేమో సీఎం రేవంత్‌రెడ్డి మా భూములను గుంజుకుంటుండు. నాకు ఇద్దరు కుమారులు, వారికీ పిల్లలున్నరు. బతుకుదెరువు కోసం ఉన్న భూమిని ప్రభుత్వం గుంజుకుంటే మేము బతికెదెట్ల సారూ?
– సూరారం నర్సింహులు, బాధిత రైతు, హయత్‌నగర్
ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?
ఇందిరాగాంధీ పాలనలోనే మా అయ్యలకు బతుకాలని భూములు పంచిండ్రు. మేము, మా పిల్లలం ఇప్పటికీ ఇవే భూములను సాగుచేసుకుంటూ బతుకుతున్నం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నది. అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి. భయాందోళన నెలకొన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయాలి.
– గంగని నాగేష్, బాధిత రైతు, హయత్‌నగర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

