నాగర్కర్నూల్, సెప్టెంబర్ 11 : నాగర్కర్నూల్ జిల్లాలో ధాన్యం తరలించేందుకు కలెక్టరేట్లో చేపట్టిన టెండర్ల ప్రక్రియలో ఘర్షణ నెలకొన్నది. ఒకే వర్గం వారికి టెండర్లు దక్కాలన్న పన్నాగంలో భాగంగా ఆఫ్లైన్ టెండర్లు వేసే వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నాగర్కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల నుంచి ధాన్యం రవాణా కోసం బుధవారం ఐడీవోసీలోని సివిల్ సప్లయ్ మేనేజర్ కార్యాలయంలో టెండర్ ప్రక్రియ కొనసాగింది. ఇదివరకే కొందరు ఆన్లైన్లో టెండర్లు వేసినప్పటికీ, ఆఫ్లైన్లో వేసేందుకు అవకాశం ఉండడంతో పలువురు వచ్చారు.
ఓ వర్గం వారు తమకే టెండర్ దక్కాలన్న ఉద్దేశంతో ఆఫ్లైన్లో టెండర్లు వేసేందుకు వచ్చిన వారిని అడ్డుకున్నారు. వారి టెండర్పత్రాలను లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కనకయ్య, ఎస్సైలతో బందోబస్తు ఏర్పాటుచేసినప్పటికీ ఎవరూ అడ్డుకోలేకపోయారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందినవారు టెండర్లను దక్కించుకునేందుకు అధికారులతో కుమ్మక్కై ఫ్యాక్షన్ తరహాలో ఇదంతా నడిపించినట్టు టెండర్దారులు వాపోయారు. టెండర్లన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.