హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : ఈడీ అఫీస్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు, అత్యుత్సాహంతో బీఆర్ఎస్ శ్రేణులపై దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారనే సమాచారం తెలిసి భారీ సంఖ్యలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కారు పోలీస్ కంట్రోల్ రూంకు ఎదురుగా రావడంతో రద్దీ మరింతగా పెరిగింది. పోలీసులు ఓవైపు రోడ్డు మూసేసి మరోవైపు రోప్‌ను ఉపయోగించి, కేటీఆర్ కారును ముందుకు పంపించారు.
బీఆర్ఎస్ నాయకులు, అభిమానులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఎందుకు తమను అడ్డుకుంటున్నారంటూ పలువురు నాయకులు నిలదీస్తున్నా పోలీసులు పట్టించుకోకుండా ఎక్కడివారిని అక్కడే ఆపేశారు. కొందరు నాయకులు, కార్యకర్తలు ముందుకు దూసుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులతో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, కేటీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తమపై పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదంటూ పలువురు నాయకులు మండిపడ్డారు. ఈడీ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పలువురు నాయకులను అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.