రామంతాపూర్, సెప్టెంబర్ 10: రేవంత్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నం 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి పరిధిలోకి తీసుకురావొద్దని రామంతాపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు గురువారం ఆందోళన నిర్వహించారు. 20 రోజులుగా తరగతులను బహిష్కరించి కళాశాల వద్ద నిరసన తెలుపుతున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కళాశాల నుంచి అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు పెద్ద ఎత్తున కళాశాల వద్దకు చేరుకొని, విద్యార్థులను అదుపు చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరుగటంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో ఉప్పల్ జోన్ డీసీపీ సురేశ్‌కుమార్, మలాజిగిరి డీసీపీ శ్రీధర్, ఉప్పల్ జోన్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఉప్పల్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏసీపీ, స్పెషల్ బ్రాంచ్, ఉప్పల్ సీఐ రామలింగారెడ్డి, ఎస్ఐలు అక్కడకు చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పి శాంతింపజేశారు.