కొండాపూర్, జూలై 26: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేసేందుకు వస్తున్నారన్న ముందస్తు సమాచారంతో కొండాపూర్‌లోని ఆయన ఇంటికి భారీసంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చారు. కౌశిక్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, రంగారావు, రవియాదవ్, వాలా హరీశ్, మల్లారెడ్డి, రోజాదేవి, తిరుమలేశ్, మల్లేశ్‌తోపాటు కార్యకర్తలు తరలివచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విధానాలను వ్యతిరేకిస్తున్న కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్, అనుబంధ సంస్థలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ప్రశిస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు, బెదిరింపులకు పాల్పడిన భయపడేది లేదని స్పష్టంచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించిన వారిపై ఎన్నడూ దాడులు చేయలేదని గుర్తుచేశారు. రేవంత్ సర్కార్ మాత్రం కొత్త పోకడలకు పోతూ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నదని విమర్శించారు.