Grama Sabha | హైదరాబాద్, జనవరి 22 (నమస్తేతెలంగాణ) : బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపిన కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సైతం గ్రామసభలు రణరంగంగా మారాయి. పలుచోట్ల ఆగ్రహం పట్టలేక కాంగ్రెస్ నాయకులను ప్రజలు కొట్టేదాకా వచ్చింది. ఆయా గ్రామాల్లో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు, పజాప్రతినిధులు తలలు పట్టుకున్నారు. పలుచోట్ల సర్వే సరిగా లేదని, అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకులే అధికారులకు ఎదురుతిరిగారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌కు నిరసన సెగ తగిలింది. తమ గ్రా మాన్ని ముంపు కింద ప్రకటించాలని నారాయణపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులు డిమాండ్ చేశారు. తమ గ్రామాల్లో బస్సులు ఆపడం లేదని నారాయణపేట జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి దమోదర రాజనర్సింహను పలువురు మహిళలు నిలదీశారు.
అన్ని అర్హతలు ఉన్నా గతంలోనూ దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు రాలేదని, కాంగ్రెస్ కార్యకర్తలు, నా యకులనే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని అన్ని చో ట్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. రేషన్ కార్డులు, రైతుభరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు ఇప్పుడు కాంగ్రెస్‌పై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ఆవేదన, ఆగ్రహాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులను ఎంపిక చేశారని, రుణమాఫీ, పింఛన్లు అందడం లేదని, మహాలక్ష్మి డబ్బులను ఎప్పుడు పంపిణీ చేస్తారని అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆయా గ్రామస్తులు ప్రశ్నల వర్షం కురిపించడమే కనిపించింది. జాబితాలను మళ్లీ సర్వే చేసి తయారు చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపించింది. నిరసనలు, నిలదీతలు, ఆందోళనలతో అధికారులు తలలుపట్టుకున్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక చాలాచోట్ల మధ్యలోనే సభలను నిలిపివేసి వెనుదిరిగారు. మంగళవారం నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్నిచోట్లా ప్రభుత్వం మరింత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలను చెదరగొట్టే ప్రయత్నం చేసింది. సూర్యాపేట, జనగామ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ నాయకుల అతి ప్రవర్తనతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో అధికారులపై తమ నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కోపంతో చిందులుతొక్కిన దొంతి
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సభలో రుణమాఫీపై ప్రశ్నించిన రైతుపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిందులుతొక్కారు. అధికారులు జాబితా చదివి వినిపించగా తమ పేరు ఎం దుకు లేదని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, భూస్వాములు, ఉద్యోగులను అర్హులుగా ప్రకటించారని మహిళలు మండిపడుతూ ఎమ్మెల్యేతోపాటు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో రైతు బంధుతోపాటు రుణమాఫీ చేయకపోవడంపై స్థానిక మాజీ సర్పంచ్ నానెబోయిన రాజారాం ప్రశ్నిస్తుండగా ఎమ్మెల్యే కోపంతో ఊగిపోతూ వేదికపై నుంచి లేచి ప్రజల్లోకి చొచ్చుకువచ్చి వార్నింగ్ ఇచ్చారు. ‘సమస్యలు ఉంటే రోడ్డుపై రాస్తారోకోలు, ధర్నాలు చేసుకోండి.. ఇది మా కాం గ్రెస్ గ్రామసభ’ అంటూ ఆగ్రహానికి లోనుకావడంతో ఎమ్మెల్యే తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తంచేశారు.
మాకేం తెల్వదు.. మంత్రి వద్దే ఫైనల్ : ఎంపీవో
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడిలో జాబితా ఎవరు తయారు చేశారని గ్రామస్తులు నిలదీశారు. దీంతో ‘మాకేం తెల్వదు. లిస్టు తయారు చేసి జిల్లా అధికారులకు ఇస్తం. వారు ఇన్చార్జి మంత్రి సీతకకు ఇస్తే అకడే తయారవుతుంది. అకడి నుం చి వచ్చిన లిస్టుని గ్రామసభల్లో చదువుతున్నాం’ అని సభలో ఎంపీవో లింగయ్య తెలుపడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. మరి ఇంకేందుకు గ్రామ సభలు పెడుతున్నారని నిలదీశారు.
నిరుపేదపై కాంగ్రెస్ నేత దాడి
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కోమట్లగూడెం లో జాబితాలో తన పేరు ఎందుకు లేదని ఓ నిరుపేద ప్రశ్నించాడు. కాంగ్రెస్ నాయకులు తమ వారి పేర్లనే జాబితో చేర్చారని ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో వేదికపై కూర్చున్న అధికార పార్టీ నేత ఒకరు ఆ నిరుపేదపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాటామాటా పెరిగి సదరు నిరుపేద ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకుడి చెంప ఛెళ్లుమనిపించాడు. అవమానంగా భావించిన అధికార పార్టీ నేత అధికారుల సమక్షంలోనే ఆ నిరుపేదపై తిరిగి దాడి చేశాడు.
గ్రామసభ టెంట్ కూల్చివేత
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుండ్రాతిమడు గు (సిద్దిక్‌నగర్)లో అధికారులు జాబితా చదువుతుండగా అందరూ అనర్హులేనని,అందులో అర్హులెవరూ లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ ప్రాతిపదికన జాబితా తయారు చేశారని నిలదీశారు. అధికారుల దురుసు ప్రవర్తనతో ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు సభ టెంట్లను కూల్చివేశారు. అశ్వారావుపేట మండలం ఆసుపాకలో అధికారులను మహిళలు చుట్టుముట్టారు. ‘మేము అర్హులం కాదా? అనర్హులను ఎలా ఎంపిక చేశారు?’ అంటూ నిలదీశారు.
అన్ని పార్టీల ఆందోళన
నేలకొండపల్లి మండలం బోదులబండలో జాబితాపై కాంగ్రెస్ సహా అన్ని పార్టీల నాయకులు అభ్యంతరం చెప్పారు. అర్హుల పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. అనర్హులను, ఉద్యోగులను, భూములున్న వాళ్లను ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. భవనాలు, పొలాలు, ఆస్తులు ఉన్న వాళ్లనే ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేశారని ఆందోళనకు దిగారు.
సెల్ టవర్ ఎక్కి నిరసన
తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చింతకాని మండలం నాగులవంచలో పారిశుధ్య కార్మికుడు పామర్తి శ్రీను సెల్‌టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో తన భార్య పేరు మీద ఓ దళారి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయించుకొని బిల్లులు స్వాహా చేశాడని ఆరోపించా డు. తనకు న్యాయం చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని, సాక్షాత్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, కలెక్టర్‌కు విన్నవించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
జీపీలో అధికారుల నిర్బంధం
కూసుమంచి మండలం పోచారంలో జాబితా మొత్తం మార్చాలని వాగ్వాదానికి దిగుతూ అధికారులను పంచాయతీ భవనంలో నిర్బంధించారు. కార్యాలయ కిటికీల అద్దాలను రాళ్లు విసిరి పగులగొట్టారు.
దండం పెడుతా.. గ్యాస్ పైసలు వేయండి
‘గ్యాస్ సబ్సిడీ పైసల కోసం చానాసార్లు దరఖాస్తు చేసుకున్న.. అయినా పైసలు పడ్తలేవు.. మీరైనా సమస్య పరిష్కరించండి’ అంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్‌కు చెందిన వృద్ధురాలు దేవునూరి అచ్చవ్వ గ్రామసభలో అధికారులకు దం డంపెట్టి వేడుకున్నది.
తమ గ్రామాల్లో బస్సులు ఆపడం లేదని పలువురు మహిళలు నారాయణపేట జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్చార్జి మంత్రి దమోదర రాజనర్సింహను నిలదీశారు.
ఎమ్మెల్యే అడ్డగింత
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనంతారానికి వచ్చిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. చేసేదేం లేక ఎమ్మెల్యే తిరిగి వెళ్లిపోయారు.
ఎంపీడీవోను నిలదీసిన మహిళలు
‘ఉన్నవారికే ఇండ్లిస్తరా? గరీబోళ్లను పట్టించుకోరా?’ అంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్లో ఎంపీడీవో శశికళను అర్హుల జాబితాలో పేర్లు రాని మహిళలు నిలదీశారు. లిస్టు లో పేర్లు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సూచించడంతో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని మండిపడ్డారు. దీంతో సభను అధికారులు అర్ధాంతరంగా ముగించారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని కామన్పెల్లికి చెందిన నాయకపుగూడ కాలనీ వాసులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైటాయించి ఆందోళన చేశారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బయ్యారంలో అర్హులకు రేషన్‌కార్డులు రాలేదని ఎంపీడీవో ప్రవీణ్‌ను ప్రజలు నిలదీశారు.
నర్సాయపల్లిలో రసాభాస
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన గ్రామసభ రసాభాసగా మారింది. అధికారులు జాబి తా వినిపించిన అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ నా యకుల మధ్య ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. చేర్యా ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామిడి జీవన్‌రెడ్డి మాట్లాడిన తర్వాత మైక్‌ను జనగామ డీసీసీ అధ్యక్షు డు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి అందజేశారు. కొమ్మూరి మైక్ తీసుకొని మాట్లాడుతుండగా బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ప్రొటోకాల్ లేకుండా కొమ్మూరికి ఎలా మైక్ ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట జరిగింది. వారిని చేర్యాల సీఐ శ్రీను, మద్దూరు, చే ర్యాల ఎస్సై నీరేశ్, కొమురవెల్లి ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామి డి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు మంతెన బాల్‌రెడ్డి ఒకరిపై ఒకరు భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నాయకుడు మంతెన బాల్‌రెడ్డి అంగీ చినిగిపోవడంతో పాటు గాయాలయ్యాయి.
లబ్ధిదారుల జాబితా చదవకండి
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అర్హుల పేర్లు లేవని అధికారులను ప్రజలు నిలదీయంతో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం మైకు తీసుకొని మాట్లాడారు.‘సభలు జరుగుతున్న ప్రతి చోటా ప్రజలు వచ్చి తమకు అర్హత ఉన్నా లబ్ధిచేకూరడం లేదని ఆందోళనలకు దిగుతుండడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నందున అసలు ఎంపిక చేసిన పేర్లు చెప్పకండి.. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది.. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది’ అని ప్రజల ముందే అధికారులకు సూచించారు.
అర్జీదారుల నుంచి 500 చొప్పున వసూలు
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లిలో ఇందిరమ్మ ఇంటి కోసం రూ.500 చొప్పున వసూలు చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే సందర్భంగా అర్జీదారుల నుంచి కారోబార్ శ్రావణ్‌కుమార్, కార్యదర్శి రాజిరెడ్డి రూ.500 చొప్పున వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మండల ప్రత్యేకాధికారి బోనగిరి నరేష్ చేరుకొని విచారణ చేపట్టగా కారోబార్కు, సఫాయిలకు డబ్బులు ఇచ్చామని అర్జీదారులు వివరించారు. ఈ మేరకు ఉన్నదిధికారులకు నివేదిం చగా కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ, కారోబార్‌ను విధు ల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
గ్రామసభల్లో ప్రొటోకాల్ రగడ
గ్రామసభల్లో చాలాచోట్ల ప్రొటోకాల్ రగడ నెలకొన్నది. జోగుళాంబ గద్వాల జిల్లా పెంచికలపాడులో బ్యానర్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఫొటో ఉండడంపై కాంగ్రెస్ పార్టీకి చెందినవారే గొడవ పెట్టుకున్నారు.హనుమకొండ జిల్లా నడికూడ మండ ం వరికోల్ సభలో పోస్టర్‌పై స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫొటో లేకపోవడంతో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో బ్యానర్‌పై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫొటో లేకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ మండలం వడ్లకొండలో అనర్హులతో జాబితా రూ పొందించారని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకుడు కొలనుపాక నరేశ్‌పై కాంగ్రెస్ నాయకుడు కోర్నెపాక విష్ణు దాడికి దిగాడు. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గ్రామసభల్లో ఆందోళనలు