హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకొని, వారు ప్రతిపాదించిన రోడ్లను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వివిధ జిల్లాల నుంచి పాడైపోయిన రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు స్వీకరించిన ఆర్ అండ్ బీ శాఖ, రూ.2,500 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రోడ్ల మరమ్మతు పనులపై సోమవారం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయం నుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పీరియాడికల్ రెన్యువల్(పీఆర్), ఫ్లడ్ డ్యామేజ్ రోడ్ల(ఎఫ్డీఆర్) మరమ్మతు పనుల కోసం ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2,500 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. రోడ్ల పరిస్థితిని సాధ్యమైనంత త్వరలో మెరుగుపర్చేందుకు ఈ నెల 15లోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలో సుమారు 26,935 కిలోమీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. రాజధానితో జిల్లా కేంద్రాలను కలిపే రోడ్లు, వివిధ జిల్లా కేంద్రాలను అనుసంధానం చేసే రోడ్లు ఇందులో ప్రధానమైనవి. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా సుమారు 4, 000 కిలోమీటర్ల మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. పలు జిల్లాల్లో చెరువు కట్టలు తెగిపోయి రోడ్లు కొట్టుకుపోయాయి. భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వెంటనే తాత్కాలిక మరమ్మతులు పూర్తిచేసిన అధికారులు, ఇప్పుడు పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.