హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లు అందించేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్లలో కుంభకోణం ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలోని కొందరు ముఖ్యనేతలు, అధికారులు భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. మహిళాశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు పెద్దలు చక్రం తిప్పినట్టు ఆ శాఖలోనే చర్చ నడుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లు అందజేయాలని నిర్ణయించింది. టెండర్లు పిలిచి సెల్ఫోన్లను సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. టెండర్ల కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో 38,117 సెల్ఫోన్లు సమకూర్చుకోవాలని మహిళాశిశు సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ చేసి, 23వ తేదీ వరకు గడువు విధించింది. కానీ ఓ కంపెనీకి చెందిన మాడల్‌ను ఖరారు చేసింది. ప్రీబిడ్ సమావేశం నిర్వహించకుండా, టెండర్ల ప్రక్రియ ముగియకుండా మాడల్‌ను ఖరారు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యనేతలు నచ్చిన కంపెనీకి టెండర్లను కట్టబెట్టి, కమీషన్లు తీసుకునేందుకు కుట్రపన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కంపెనీల నుంచి టెండర్లు స్వీకరించాలి. కంపెనీల మధ్య పోటీ ఏర్పడితే ఉత్తమమైన సాంకేతికత కలిగిన ఫోన్లు తక్కువ ధరకు సమకూర్చుకోవచ్చు. తద్వారా ప్రజాధనం వృథాకాకుండా ఉంటుంది. కానీ, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం ఒక కంపెనీ స్మార్ట్ఫోన్ల డీలర్లకు మాత్రమే కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేంటనేది స్త్రీశిశు సంక్షేమశాఖలోనే కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. టెండర్ నిబంధనలను కూడా ఆ కంపెనీకి అనుగుణంగా మార్చినట్టు తెలుస్తున్నది. టెండర్ల ప్రక్రియను రద్దు చేయాలని అంగన్వాడీ యూనియన్ల నేతలు డిమాండ్ చేస్తున్నారు.