హైదరాబాద్ మే 17 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కోసం టెండర్ల గడువును మూడోసారి పొడిగించారు. మే 15 తేదీ వరకు విధించిన గడువును మరో పది రోజులు పొడిగించారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో టెండర్లను తెరిచి తక్కువగా కోట్ చేసిన వారికి సరఫరా బాధ్యతలను కట్టబెడతారని అనుకుంటున్న తరుణంలో మళ్లీ గడువు పొడిగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివెనుక అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతున్నది. దక్షిణ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ అగ్రనేత కుమారుడైన సదరు ఎమ్మెల్యే పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడిని వెంటబెట్టుకొని రెండు రోజుల క్రితం సెక్రటేరియట్లో సంబంధిత మంత్రిని కలిసినట్టు తెలుస్తున్నది.
అంగన్వాడీ సెంటర్లకు తక్కువ ధరకు కోడిగుడ్లను సరఫరా చేస్తామని అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. సెంట్రలైజ్డ్ నిబం ధలను రద్దుచేసి డిస్ట్రిక్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేలా రూల్స్ రూపొందించాలని కోరినట్టు పౌల్ట్రీ అసోసియేషన్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే టెండర్లను ఉన్నపళంగా రద్దుచేస్తే వివాదస్పదమయ్యే అవకాశముంటుందని, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని భావించి గడువు పొడిగించినట్టు చర్చ జరుగుతున్నది.