గుర్రంపోడ్, మే 4 : పండించిన పంట దిగుబడి లేక, గిట్టుబాటు ధర రాక అప్పుల్లో కూరుకుపోయిన కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం చేపూరులో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. చేపూరుకు చెందిన నకినబోయిన సత్తయ్య(52) పదెకరాలు కౌలుకు తీసుకుని ఐదెకరాలు మిర్చి, ఐదెకరాలు పత్తి సాగుచేశాడు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పంట దిగుబడి రాలేదు. వచ్చిన కొద్ది పంటకు గిట్టుబాటు ధర రాలేదు. దీంతో రూ.7 లక్షల వరకు అప్పులు అయ్యాయి. తెచ్చిన అప్పులు అలాగే ఉండిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొండ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.