వికారాబాద్, మార్చి 4 : పదేండ్ల నల్లా బిల్లులు ఒకేసారి కట్టాలని వికారాబాద్ మున్సిపల్ అధికారులు హుకూం జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని 5వ వార్డు కొత్రేపల్లివాసులు మంగళవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌కు సమస్యను విన్నవించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
నెలకు రూ.200 చొప్పున పదేండ్లకు కలిపి రూ.24వేలకుపైగా బిల్లులు వచ్చాయని, వాటిని వెంటనే కట్టాలని వత్తిడి చేస్తున్నారని వారు మండిపడ్డారు. వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు.