అయిజ/రాజోళి/అమరచింత, మే 22 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న అకాల వర్షాలకు డ్యాంలోకి వరద ప్రవాహం చేరుతున్నది. గురువారం డ్యాంలోకి 8,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నీటి మట్టం 1588.80 అడుగులు ఉండగా, 10.058 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు 18 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, వచ్చిన నీరు వచ్చినట్టే దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు చేరుతున్నది. సుంకేసులకు 17,648 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అదేవిధంగా జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు చేరుతున్నది. గురువారం సాయంత్రం వరకు దాదాపు పదివేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.