హైదరాబాద్: హైకోర్టుకు (High Court) నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు నేడు ప్రమాణం స్వీకరించనున్నారు. ఉదయం 9:45 గంటలకు హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరుగనున్న కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరనుంది. ప్రస్తుతం 19 మంది జడ్జిలు సేవలు అందిస్తున్నారు. కాగా, హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉన్నది. హైకోర్టులో ఒకేసారి పది మంది న్యాయమూర్తులు నియమితులవడం ఇదే మొదటిసారి.
కొత్తగా నియమితులైనవారిలో.. న్యాయవాదుల కోటా నుంచి కాసోజు సురేందర్, సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్, జువ్వాడి శ్రీదేవి, నాచరా వెంకట శ్రవణ్‌కుమార్, న్యాయాధికారులు విభాగం నుంచి జీ అనుపమ చ్రకవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివ నాయుడు, ఏ సంతోష్‌రెడ్డి, డాక్టర్ డీ నాగార్జున ఉన్నారు.