CLP Meeting | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ సీఎల్పీ సమావేశంలో పాల్గొనేందుకు ఎంసీహెచ్ఆర్డీ వరకు వచ్చారు. కానీ కాంగ్రెస్ నేతలు వారిని వెనుక గేటు నుంచి తప్పించారు.
ఈ దృశ్యాలను ‘నమస్తే తెలంగాణ’ కెమెరామెన్ తన కెమెరాలో బంధించారు. సీఎల్పీ సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించామని, వారు కూడా హాజరవుతారని సీఎల్పీ ముఖ్యనాయకుడు ఒకరు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా సిబ్బంది, కెమెరామన్లు అక్కడికి చేరుకున్నారు. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో వారు గైర్హాజరయ్యారు. ఫిరాయింపుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఈ నెల 10న తదుపరి విచారణ జరుగనుంది.
మరోవైపు రెండు రోజుల కిందనే అసెంబ్లీ కార్యదర్శి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశానికి హాజరైతే న్యాయపరమైన చికులు ఎదురోవాల్సి వస్తుందని ఫిరాయింపుదారులు వెనుకడుగు వేశారని చెప్పుకుంటున్నారు. ఈ మీటింగ్‌కు హాజరైతే బీఆర్ఎస్ పార్టీకి మరో చాన్స్ ఇచ్చినట్టు అవుతుందని, ఫిరాయింపునకు పాల్పడినట్టు సుప్రీంకోర్టుకు స్పష్టమైన ఆధారం ఇచ్చినట్టు అవుతుందనే కారణంతో 10 మంది ఫిరాయింపుదారులు మీటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సీఎల్పీ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు.
న్యాయపరమైన వివాదం ఏర్పడుతుందని తెలిసి కూడా తమను సీఎల్పీ భేటీకి ఆహ్వానించడంపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు మండిపడుతున్నట్టు తెలిసింది. పార్టీ ఆహ్వానం మేరకు 10 ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. కానీ చివరి నిమిషంలో సమావేశానికి హాజరుకావొద్దని నిర్ణయించుకున్నారు. ఫిరాయింపుల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న సమయంలో సమావేశానికి హాజరుకావడం సరైన నిర్ణయం కాదని న్యాయవాదులు హెచ్చరించటంతో 8 మంది ఎమ్మెల్యేలు మార్గమధ్యం నుంచే మళ్లిపోయినట్టు తెలిసింది. కానీ తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య మాత్రం సమావేశ వేదిక వరకు వచ్చారు.
అక్కడ వారికి ఎమ్మెల్సీ కోదండరాం మాత్రమే కనిపించారు. తమ సహచర ఫిరాయింపు ఎమ్మెల్యేల జాడ కోసం వారు ఆయనను ఆరా తీసినట్టు తెలిసింది. న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో వారు సీఎల్పీకి దూరంగా ఉన్నట్టు తెలియడంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళనపడ్డట్టు సమాచారం. వెంటనే అక్కడున్న కాంగ్రెస్ నేతలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను వెనుక గేటు నుంచి బయటికి పంపే ఏర్పాట్లు చేశారు.
న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా తమను సమావేశానికి ఆహ్వానించటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం. చెప్పుడు మాటలు నమ్మి పార్టీ ఫిరాయించి వచ్చినందుకు తమను సుప్రీంకోర్టు ముందు అడ్డంగా ఇరికించేందుకే కుట్రలు చేశారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.