Liquor Brands | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఇటీవల కొత్తగా ఐదు మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత, కొత్త కంపెనీల నుంచి వచ్చే ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనుకకు తగ్గినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాలపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ వరుసగా కథనాలు రాసింది. కొత్త బీర్ బ్రాండ్లపై నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. కొత్తకొత్త మీమ్స్‌తో తమ నిరసనను వ్యక్తంచేశారు. దీంతో కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది. మొత్తంగా కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారం తలనొప్పిగా మారడంతో కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది.
తెలంగాణలో కొత్తగా బీర్లు సప్లయ్ చేసేందుకు ఐదు కొత్త కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చింది. ఈ ఐదు కంపెనీలు సుమారు 27 రకాల బీర్లను తెలంగాణలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి. అనుమతులు పొందిన కొన్ని కంపెనీల నేపథ్యం సరిగా లేకపోవడం, కొన్నిచోట్ల కల్తీ మద్యాన్ని విక్రయించారని వార్తలు రావడంతో ప్రజలు, మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’ రాసిన కథనాల ఆధారంగా మీడియా కూడా ఈ వ్యవహారంపై దృష్టిపెట్టడంతో ప్రభుత్వం ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించి.. వారికి ఇచ్చిన అనుమతులను ప్రస్తుతానికి నిలిపివేసినట్టు సమాచారం.
ఏపీలో నూతన మద్యం పాలసీని రచించే క్రమంలో కింగ్‌ఫిషర్ బీర్లను లోడ్లకు లోడ్లు దించుతుంటే.. తెలంగాణలో మాత్రం ఇంకా కొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ రేషన్ పద్ధతిలోనే కొన్ని ప్రముఖ బ్రాండ్లకు చెందిన బీర్లను సప్లయ్ చేస్తున్నట్టు మద్యం షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టే సప్లయ్‌ని పెంచామని, అన్నిమద్యం షాపుల్లో బీర్ల నిల్వలు ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ చెప్తున్నది. మొత్తానికి తెలంగాణలో కృత్రిమంగా బీర్ల కొరత సృష్టించారని అర్థమైంది. ఈ కృత్రిమ కొరత నేపథ్యంలో కొందరు వ్యాపారులు సిండికేట్ అయినట్టు సమాచారం. ఉన్న కొరతను, రేషన్ పద్ధతిలో వస్తున్న సప్లయ్‌ని క్యాష్ చేసుకునేందుకు బెల్ట్‌షాపుల నిర్వాహకులతో కుమ్మక్కు అయినట్టు మద్యం ప్రియులు వాపోతున్నారు. అధిక ధరలకు బీర్లను విక్రయిస్తున్నారని, ఎక్సైజ్‌శాఖ దీనిపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.