జగిత్యాల, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రెండూ సర్కారు శాఖలే.. పైగా రెండింటికీ మంత్రి ఒక్కరే. అయినా వాటి మధ్య కొరవడిన సమన్వయం, పట్టింపులేని ధోరణి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేని నిస్సహాయత, మంత్రులు, ఎమ్మెల్యేల ఉదాసీనత వెరసీ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం ఉద్రిక్తతకు కేంద్రబిందువైనది. ఆలయ అంశం ఆందోళనకు గురి చేస్తున్నది. అటవీశాఖ భూముల్లో ఆలయ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని ఖాళీ చేయమంటున్నారని ఒకవైపు, అలాంటిదేమీ లేదని మరోవైపు మొత్తంగా గందరగోళ పరిస్థితి నెలకొన్నది. నిత్యం ఆధ్యాత్మిక శోభను వెలువరించే కొండగట్టులో ఆలయ పరిధిలోని నిర్మాణాలు, భూమిని కాపాడాలంటూ ప్రజలు, భక్తులు, వివిధ సంస్థలు ధర్నాలు, నిరసనలు చేపట్టే దుస్థితి దాపురించింది. ఇంతటి ఉద్రిక్తతలకు ప్రభుత్వ పెద్దలు, సంబంధిత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల పట్టింపులేనితనమే కారణం అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామపరిధిలో అంజన్న ఆలయం ప్రకృతి అందాల మధ్య సహజసిద్ధంగా వెలసింది. క్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు, ఔషధవనాలకు పెట్టింది పేరు. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. ఏటా లక్షల్లో స్వామిదీక్షాపరులు మాల విరమణ చేస్తారు. స్వయంభువుగా వెలసిన అంజన్న క్షేత్రానికి గతంలో సుమారు 35 ఎకరాల వరకు స్థలం ఉండేది. దశాబ్దాలుగా కొండప్రాంతాలు అటవీశాఖ ఆధీనంలోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్వయంగా అంజన్న భక్తుడైన అప్పటి సీఎం కేసీఆర్ స్వామిని దర్శించుకున్నారు.
ఆ సమయంలో ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి భూములు లేవన్న విషయం తెలుసుకుని రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్న 400 ఎకరాలకు పైబడిన భూమిని అంజన్న ఆలయ (దేవాదాయ శాఖ) పరిధిలోకి తీసుకొచ్చారు. ఆలయాభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేస్తానని చెప్పి, వెంటనే రూ.100 కోట్ల నిధులూ ఇచ్చారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో కొండగట్టు ఆలయానికి సువిశాలమైన సొంత స్థలం సమకూరింది.
అంజన్న ఆలయంలో ఇటీవల అటవీ, దేవాదాయ శాఖల మధ్య తకరారు జరుగుతున్నది. 2024లో ఈవో ఆలయాభివృద్ధికి అటవీశాఖ ఆధీనంలో ఉన్న రెండెకరాల స్థలం అవసరమని, దాన్ని అప్పగిస్తే బదులుగా మరోచోట దేవాదాయ శాఖకు చెందిన స్థలాన్ని వారికి అప్పగిస్తామని నివేదించగా ఎలాంటి నిర్ణయం రాలేదు. ఇదిలా ఉండగా ఇటీవల అటవీశాఖ అధికారులు వై జంక్షన్ వద్ద అర్బన్ పార్క్ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలుపెట్టగా ఆలయ అధికారులు అడ్డుకున్నారు.
దీంతో ఇరు శాఖల మధ్య పోరు షురూ అయింది. అదే సమయంలో దేవాదాయశాఖ పరిధిలోని భూములను గ్లోబల్ డిఫరెన్షియల్ పొజిషన్ సర్వే చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కొండగట్టు ఆలయ అధికారులు హద్దుల్లో ఉన్న ఇతరశాఖల అధికారులు, ప్రైవేట్ వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. ఆ క్రమంలో అటవీశాఖకూ నోటీసులు వెళ్లాయి. సర్వే తర్వాత పూర్తిస్థాయి నక్షాలు బహిర్గతమయ్యాయి. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు కొండగట్టు ఆలయ పరిధిలోని ఆరున్నర ఎకరాల స్థలానికి హద్దులు గుర్తించి మార్కింగ్ చేయడం వివాదానికి దారి తీయగా, ఏడీఎస్ఎల్ఆర్ ద్వారా సర్వే నిర్వహించాలని దేవాదాయశాఖ అధికారులు కోరడం సమస్యను మరింత జటిలం చేసింది.
ఆరున్నర ఎకరాల రిజర్వు ఫారెస్ట్ స్థలం తమ పరిధిలోనిదంటూ అటవీశాఖ అధికారులు చేసిన మార్కింగ్‌లు తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటికే మార్కింగ్ చేసిన స్థలంలో రామాలయం, 20 గదుల ధర్మశాల, సాగర్ గెస్ట్‌హౌస్, హరిత హోటల్, వాహన పూజా మండపం, పార్కింగ్ స్థలం, డార్మెంటరీ హాల్, ఈవో కార్యాలయం ఇలా అనేక నిర్మాణాలు ఉండటంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకుంటారన్న పుకార్లు మొదలయ్యాయి. దీనికి తోడు అటవీశాఖ అధికారులు ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు ఉన్నాయని, అవన్నీ రక్షిత అటవీ భూములంటూ నోటీసులు జారీ చేయడం సమస్యను మరింత తీవ్రం చేసింది. అటవీశాఖ ఇచ్చిన నోటీసుల విషయం బయటకురావడంతో అంజన్న భక్తులు, వివిధ సంస్థల సభ్యులు, కార్యకర్తలు ఆలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆలయ భూముల జోలికొస్తే ఊరుకోమని, అంజన్న భూములు ఏ శాఖ పరిధిలో ఉన్నా అవి స్వామికే దక్కుతాయంటూ నినదించడంతో విషయం క్రమక్రమంగా రాజకీయ రంగు పులుముకున్నది.
అటవీ, దేవాదాయ శాఖ మధ్య నెలకొన్న తకరారు క్రమంగా ఉద్రిక్తతలకు దారితీయడంతో పాటు ఆధ్యాత్మిక క్షేత్ర ప్రాభవాన్ని దెబ్బతీసేలా మారింది. అటవీశాఖ ఆధీనంలో ఉన్నట్టు చెబుతున్న ఆరున్నర ఎకరాల విషయమై ఇప్పటి వరకు అటు అటవీ, రెవెన్యూ శాఖ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. పైగా జరిగిన నిర్మాణాలకు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరై ప్రారంభించినప్పుడు కూడా వివాదాస్పదం కాలేదు. ఐదారేండ్ల కిందట సీఎం కేసీఆర్ ఇచ్చిన 400 ఎకరాలతో ఆలయానికి పుష్కలమైన భూమి అందుబాటులోకి వచ్చినా ఇప్పుడు అటవీ, దేవాదాయ శాఖల సమన్వయలోపం సమస్యగా మారింది. కనీసం ప్రభుత్వ పెద్దలైనా పట్టించుకుంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయాలూ వెలువడుతున్నాయి. కాగా, మంత్రి కొండా సురేఖ పరిధిలోనే రెండు శాఖలు ఉన్నా సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తే సరిపోయేదని, ఎవ్వరూ పట్టించుకోని నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటున్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రంలో అటవీ, దేవాదాయ శాఖల మధ్య నెలకొన్న భూవివాదం సద్దుమణిగింది. ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు అటవీశాఖ పరిధిలోని భూముల్లో ఉన్నాయి. దేవాదాయశాఖ అధికారులు అటవీశాఖ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమికి ప్రత్యామ్నాయం చూపించేందుకు అవకాశాలున్నాయి. కొండగట్టుపై భూసర్వే నిర్వహించాం., అటవీశాఖ హద్దులను చెరిపివేసి నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చాం. ఇదే విషయమై కలెక్టర్ ఇరు శాఖల అధికారుల వివరణ కోరారు. అంజన్న ఆలయ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్నీ అంజన్న ఆధీనంలోనే ఉంటాయి.
-జగిత్యాల ఆర్డీవో పులి మధుసూదన్