హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): వేసవి ఎండలు ముదరటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. మంగళవారం 25 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెంజల్, ఆదిలాబాద్ జిల్లా బేలలో 44.2 డిగ్రీలు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ వెల్లడించింది.
రాగల 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని, ప్రత్యేకించి ఈ నెల 6, 7న ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరగవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇదే సమయంలో గంటకు 40 కి.మీ. వేగంతో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తాయని, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.