Telugu University | తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్ 8 : పుస్తక పఠనంతో జ్ఞానాన్ని పెంచుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెల్దండ నిత్యానందరావు అన్నారు. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ప్రాగంణంలో గల ప్రచురణ విభాగం ముద్రించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించేందుకు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను నిత్యానందరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పుస్తకాలను చదివడం ద్వారా సముపార్జించిన జ్ఞానంతో కొత్త ఆలోచనలతో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చని నేటి తరానికి సూచించారు.
ఈ నెల 17వ తేదీవరకు పుస్తక ప్రదర్శన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని డిప్యూటీ రిజిస్ట్రార్ ఎఎన్ జగదీష్ పేర్కొన్నారు. పుస్తకాలపై 60 శాతం వరకు ప్రత్యేక రాయితీ ఉంటుందని ప్రచురణల విభాగం సంచాలకులు ఎంవి ఆదిలక్ష్మి తెలిపారు. వర్సిటీ సహాయ సంచాలకులు బి శ్రీనివాస్‌గౌడ్, ప్రచురణ విభాగం సూపరిండెంట్ రాజ్‌కుమార్, యాదయ్య, ప్రవీణ్‌కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.