హైదరాబాద్ : అధిక సాంద్రత విధానం, సింగిల్ పిక్ విధానంలో పత్తిసాగును ప్రోత్సహించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కొత్త విధానంతో అనేక లాభాలున్నాయని, తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి సాధించడంతో పాటు సాగు నీరు కూడా ఆదా అవుతోందని చెప్పారు.
ముఖ్యంగా పత్తి తెంపడంలో కూలీల కొరత లేకుండా యాంత్రికీకరణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో ప్రతి పంట సాగు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం జరగాలన్నారు. అధికసాంద్రత పత్తి సాగులో తెలంగాణ దేశానికి తలమానికం కావాలన్నారు. అయితే కొత్త విధానంలో పత్తి సాగుకు ముందు ఆ భూములు అనుకులామా..? లేదా..? అనేది కూడా నిర్ణయించాలని సూచించారు. సాగుకు యోగ్యమైన భూములున్న రైతులను మాత్రమే ప్రోత్సహించాలన్నారు.
తొందరపడి పత్తి విత్తనాలను నాటొద్దని, రెండో వాన తర్వాతే పత్తిసాగుకు సిద్ధం కావాలని రైతులకు సూచించారు. ప్రపంచ అవసరాలకు సరిపడా పత్తి ఉత్పత్తి కావడం లేదన్నారు. ప్రపంచంలో అత్యధిక పత్తి సాగయ్యేది భారతదేశంలోనేనని తెలిపారు. దేశంలో 3.20 కోట్ల ఎకరాలలో పత్తి సాగు అవుతున్నదని, పత్తిసాగులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో తెలంగాణ, గుజరాత్ ఉన్నాయన్నారు. చైనాలో 80 లక్షల ఎకరాలలో, అమెరికాలో 75 నుంచి 80 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతున్నదన్నారు. బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో 18 నుంచి 50 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతున్నదని తెలిపారు. చైనాలో 80 లక్షల ఎకరాలల్లోనే పత్తి సాగవుతున్నప్పటికీ మనకన్నా మూడింతలు ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారన్నారు. ఉత్పాదకత విషయంలో దేశం వెనుకబడి ఉందని, సాంకేతికతను అందిపుచ్చుకుంటే ప్రపంచ అవసరాలకు సరిపోయేంత పత్తిని మన దేశమే ఉత్పత్తి చేయొచ్చని తెలిపారు.
దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలని, యాంత్రికీకరణ, సాంకేతికతను సంపూర్ణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ ప్రయత్నం ఫలప్రదమయితే తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా పత్తి పండించే రైతులకు మేలు చేకూరుతుందన్నారు. కేవలం అధిక మోతాదులో పంటలు పండించడమే కాకుండా మార్కెట్‌కు అవసరమైన పంటలు, డిమాండ్ ఉన్న పంటలు, రైతుకు రాబడినిచ్చే పంటలు పండించాలని సూచించారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించి రాష్ట్ర ఆదాయం, దేశ ఆదాయం పెంచేలా తెలంగాణ వ్యవసాయం ముందుకుసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా మూడేళ్లుగా రైతులను అప్రమత్తం చేస్తున్నామని, జిల్లాల వారీగా అవగాహన సదస్సులతో ఏ పంటలు వేయాలి అనే విషయాన్ని రైతులకు వివరించినట్లు తెలిపారు. రైతులు కూడా పంటల వైవిద్యీకరణకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ జగదీశ్ పాల్గొన్నారు.