Power Cuts |ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు, పవర్‌హాలిడేలు నిత్యకృత్యం. విద్యుత్తు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సమైక్య ప్రభుత్వాలు కనీస ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టిన తరువాత పరిస్థితిని చక్కదిద్దారు. విద్యుత్తు రంగాన్ని సంస్కరించారు. పటిష్టమైన వ్యవస్థను తయారుచేసి నిరంతర విద్యుత్తు వెలుగులను పంచారు.
పదేండ్లలో తెలంగాణ అందిపుచ్చుకున్న విద్యుత్తు వ్యవస్థనూ.. ప్రస్తుతం రేవంత్ సర్కార్ వాడుకోలేకపోతున్నది. ఫలితంగా కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కరెంటు సరిపడా లేకున్నా కొరత, కోత లేకుండా కేసీఆర్ సర్కార్ చూస్తే.. కరెంటు ఉన్నా సరఫరా చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నది.
నిరంతర విద్యుత్తు సరఫరా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కేసీఆర్. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలు, పవర్‌హాలిడేలు నిత్యకృత్యంగా ఉండేవి. కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టిన తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దారు. విద్యుత్తురంగాన్ని సంస్కరించారు. పాలకులకు చిత్తశుద్ధి, కమిట్మెంట్, సరైన ప్రణాళిక ఉంటే నగరాలు, పట్టణాలకే కాదు ప్రతి మారుమూల పల్లెకూ, ప్రతి ఇంటికీ, ప్రతి వ్యవసాయ మోటర్కూ 24 గంటల విద్యుత్తు అందించడం సాధ్యమేనని నిరూపించారు. కరెంటు కోతలు, పవర్‌హాలిడేలు లేని, జనరేటర్లు, కన్వర్టర్లు అవసరంలేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారు. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. విద్యుత్తు రంగంలో క్రమంగా ఉమ్మడి రాష్ట్రం నాటి కష్టాలు మొదలవుతున్నాయి.
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న సామెత తెలంగాణ విద్యుత్తు రంగానికి వర్తిస్తుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దినా దానిని వినియోగించుకోలేని దుస్థితి నేటి ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. కరెంట్ పుష్కలంగా ఉన్నా.. సరఫరా వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నా.. రాష్ట్రంలో కరెంట్ కోతలు నిత్యకృతమయ్యాయి. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటలునిరాటంకంగా విద్యుత్తు సరఫరా జరిగితే, ఇప్పుడు రోజుకు 14 గంటలకు మించి కరెంట్ ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. ఇక లోవోల్టేజీ సంగతి సరేసరి. మళ్లీ మోటర్లు కాలిపోతున్న, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్న రోజులొచ్చాయి. దీంతో కరెంటు లేక, నీళ్లు అందక పచ్చని పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు విద్యుత్తురంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రయత్నించాయి. అందుకే డిస్కమ్‌లను గాలికొదిలేశాయి. దీంతో మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం నిత్యకృత్యమైంది. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో ఉదయం మూడు, సాయంత్రం మూడు గంటలు మాత్రమే త్రీ ఫేజ్ విద్యుత్తు అందేది. రాత్రి మాత్రమే సింగిల్ ఫేజ్ విద్యుత్తు ఇచ్చేవారు. మండలాల్లో 8 గంటలు, మున్సిపాలిటీల్లో 6 గంటలు, హైదరాబాద్‌లో నాలుగు గంటల విద్యుత్తు కోతలుండేవి. పవర్‌హాలిడేతో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన రోజులన్నాయి. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లినవారికి స్నానాలు చేయడానికి కరెంట్‌లేక.. నీళ్లు దొరికేవి కావు. 2014లో రాష్ట్రం ఆవిర్భవించే నాటికి 5 వేల మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేది. తెలంగాణ ఏర్పడితే అంతా అంధకారమేనని, కరెంట్ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావంటూ నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెక్కిరించారు. తన తండ్రి చనిపోతే కరెంట్ లేక నీళ్లు నెత్తిన మీద చల్లుకున్నామని ప్రస్తుత సీఎం రేవంత్ ఆరోజుల్లో చెప్పారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సర్కార్ దశాబ్దాలుగా సాగుతున్న కరెంట్ కోతలను దూరం చేసింది. అన్నదాతకు అపూర్వ కానుకగా 24 గంటల విద్యుత్తునందించింది. మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్పల్లి వరకు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ట్రాన్స్మిషన్ లైన్ పూర్తిచేసేందుకు చొరవ చూపింది. నేషనల్ గ్రిడ్‌తో తెలంగాణ రాష్ట్రం అనుసంధానమైంది. ఉత్తరగ్రిడ్.. దక్షిణగ్రిడ్ కనెక్టివిటీ అయ్యింది. దేశంలో ఎక్కడినుంచైనా విద్యుత్తును పొందే రాష్ట్రంగా చరిత్రకెక్కింది. అధికారం చేపట్టిన రెండేండ్లల్లోనే 2016 నవంబర్లోనే అన్నదాతకు 24 గంటల విద్యుత్తును అమలుచేసింది. ప్రయోగాత్మకంగా పలు జిల్లాల్లో 24 గంటల విద్యుత్తును సరఫరా చేసింది. 9 గంటల విద్యుత్తు నుంచి 24 గంటల విద్యుత్తునందించే స్థాయికి ఎదిగింది. గతంలో పవర్ హాలిడే ఉన్న స్థితి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఎవ్రీ డే పవర్‌డే.. ఎవ్రీడే పపర్ఫుల్డే అనే స్థాయికి చేర్చింది.

నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగ బలోపేతం, కరెంట్ సరఫరా మెరుగుపరిచేందుకు రూ.39,321 కోట్లు ఖర్చుచేసింది. ట్రాన్స్మిషన్ నెట్వర్క్ బలోపేతానికి రూ.18, 874 కోట్లు, విద్యుత్తు పంపిణీ నెట్వర్క్ పునరుద్ధరణకు పల్లెప్రగతిలో రూ.506 కోట్లు, పట్టణప్రగతిలో రూ.249 కోట్ల చొప్పు న ఖర్చుచేసింది. డిస్కంల ద్వారా 1,062 కొత్త 33/11కేవీ సబ్స్టేషన్లు, 3.89 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 1.83 లక్షల డిస్ట్రిబ్యూషన్ లైన్లు వేసింది. గరిష్ఠ డిమాండ్ 18 వేల మెగావాట్లు దాటినా, వినియోగం 330 మిలియన్ యూనిట్లు దాటినా గ్రిడ్ కుప్పకూలడంలేదు.
ఒకప్పుడు కరెంట్‌లేదు. సరఫరా వ్యవస్థ లేదు. కానీ ఇప్పుడు అన్ని ఉన్నాయి. లేనిదల్లా ఈ వ్యవస్థను సక్రమంగా వినియోగించుకుకొనేందుకు అవసరమైన కార్యాచరణ. నిర్వహణ వైఫల్యాల కారణంగా వేసవి ప్రారంభంలోనే రైతులకు సాగునీటి కష్టాలు వచ్చాయి. భూగర్భ జలాలు పడిపోతుండటంతో బోర్లు వట్టిబోతున్నాయి. యాసంగి పంటలు ప్రశ్నార్థకంగా మారాయి. కాపాడుకొనేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. జాతీయంగా పుష్కలంగా విద్యుత్తు అందుబాటులో ఉన్నది. ఉత్తరాది రాష్ర్టాల్లో విద్యుత్తుకు డిమాండ్ లేదు. కానీ, ఈ రాష్ర్టాల్లోని ప్లాంట్లలో విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. ఈ విద్యుత్తును కొనుగోలుచేసి రాష్ర్టానికి, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాల్సిన రాష్ట ప్రభుత్వం.. ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఉన్న కరెంట్‌ను, ఉన్న వ్యవస్థను వాడుకోలేక కోతలు తెచ్చిపెట్టింది.
కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు మంచిగుండె. అసలు కరెంటే పోకపోతుండె. కాంగ్రెస్ వచ్చినంక కరెంటు తిప్పలు ఎక్కువైనయ్. వంతుల వారీగా కరెంట్ ఇస్తున్నరు. రాత్రిపూట కరెంటు కోసం చీకట్లో పొలాలకు పోవాల్సి వస్తున్నది.
కేసీఆర్ హయాంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసిండ్రు. 24 గంటలు కరెంటు ఉండటంతో పంటలు మంచిగ పండినయ్. ఇప్పుడేమో లోవోల్టేజీ సమస్యతో వ్యవసాయ బోరు మోటర్లు కాలిపోతున్నాయి. కరెంట్ ఎక్కువగా ఇస్తలేరు. లోవోల్టేజీ కరెంట్ ఉండటంతో బోర్లు నీరుపోయడం లేదు. కొల్చారంలో ఉన్న ఓ ట్రాన్స్ఫార్మర్కు 19 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్ని మోటర్లు ఒకేసారి స్టార్ట్ చేయడంతో లోవోల్టేజీ కరెంట్ సరఫరా కావడంతో కొన్ని బోర్లు నీళ్తు పోస్తలే. దీంతో బోర్లు బంద్ చేసుకుంటున్నం. లోవోల్టేజీ సమస్య ఉన్నదని విద్యుత్తు శాఖ అధికారులకు చెప్తే కొత్త ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలంటున్నరు. డీడీలు కడితే మంజూరు చేస్తామంటున్నరు. పంటలు ఎండిపోతున్నాయి.. కరెంట్ సమస్య తీవ్రంగా ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా.. సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతున్నది. సాగులో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. పోతుందని విద్యుత్తు సిబ్బందిని అడిగితే పైనుంచి పోతున్నదని, లైన్ఫాల్ట్ అని అంటున్నరు. పొలాల వద్ద నీరు అందించడానికి రాత్రీపగలు కాపలా ఉండాల్సి వస్తున్నది. సరఫరా నిలిచిపోయినప్పుడల్లా స్టార్టర్ ఆన్ చేయాల్సి ఉంటుంది. విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఎండలు మొదలు కాకముందుకే కరెంట్ కోత మొదలైంది. రోజులో రెండు మూడుసార్లు కరెంట్ పోతాంది. ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలుస్తనే లేదు. ఇప్పుడే ఇట్లా ఉంటే రానున్న రోజులను తలుసుకుంటే భయమేస్తుంది. కేసీఆర్ హయాంలో ఇలా కరెంటు తిప్పలు లేకుండె. ఎప్పుడు కరెంట్ పోతుందోనన్న భయం లేకుండా ఉండేది. ఇప్పడు అలా లేదు. మధ్యాహ్నం సమయంలో ఫ్యాన్ వేసుకోవాలన్నా తరచూ కరెంట్ పోతుంటే ఇబ్బందులు పడుతున్నాం.
కరెంట్ కోతలతో తిప్పలు పడుతున్నం. ఓ వైపు దోమలు, ఉక్కపోతతో కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. కరెంటు కోతలు తీవ్రంగా ఉండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నం. ఇకనైనా కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలి.
