Vijay’s TVK : దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షను కేంద్రం పూర్తిగా రద్దు చేసి, వైద్య విద్యపై పూర్తి హక్కులను రాష్ట్రాలకే ఇవ్వాలని తమిళనాడుకు చెందిన అధికార టీవీకే పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో సీజేపీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ స్పందించింది. నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలపై చర్యలు తీసుకుంటే మాత్రమే చాలదని.. వైద్యవిద్యలో ప్రవేశం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షనే పూర్తిగా రద్దు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. వైద్య విద్య నిర్వహణపై పూర్తి బాధ్యతల్ని రాష్ట్రాలకే అప్పగించాలని కూడా టీవీకే డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం విద్యాను రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి మార్చాలని కూడా కోరుతోంది. దీనివల్ల ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని వెల్లడించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చట్టపరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే, అంతవరకు తాత్కాలికంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలని సూచించింది. దీనివల్ల సాధారణ విద్యతోపాటు వైద్యవిద్యపై రాష్ట్రాలకు పూర్తి హక్కు లభిస్తుందని తెలిపింది.
నీట్ సమస్య పరిష్కారానికి ఇదే చక్కని పరిష్కారం అని గతంలోనే తమ నాయకుడు విజయ్ చెప్పారని ఆ పార్టీ వెల్లడించింది. ఇదే సమయంలో తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకేపై మండిపడింది. ఓట్ల కోసం నీట్ పరీక్ష రద్దు చేస్తామని చెప్పి, రాజకీయంగా ప్రజల్ని మోసం చేయబోమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నీట్ పరీక్షను రద్దు చేస్తామని 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే ప్రజలకు హామీ ఇచ్చింది.