కేసీఆర్ పాలన.. పవర్ఫుల్ జమానా.. కోతలకు చెక్.. కరెంట్ కష్టాలకు ఫుల్స్టాప్
ఉమ్మడి రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో మగ్గిన తెలంగాణబిడ్డలు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెల్వని కరెంటు కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. వెలుగు దారులు చూపే నాథుడు లేక కుమిలిపోయారు. అప్రకటిత విద్యుత్తు కోతలు.. రాత్రిపూట కరెంటుతో అరిగోస పడ్డారు.
- సంస్కరణలతో విద్యుత్తు రంగానికి నయాలుక్
- జెన్కో ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్లాంట్ల ఏర్పాటు
- మెరుపువేగంతో పెండింగ్ విద్యుత్తు ప్లాంట్ల పూర్తి
- 2014లో 7,778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదక
- సామర్థ్యముంటే 2023 నాటికి 18,567 మెగావాట్లకు!
- చీకట్లను చీల్చుతూ వెలుగుబాటలో నడిపించిన కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో మగ్గింది తెలంగాణ. కరెంటు ఎప్పుడొస్తుందో, రాదో తెల్వని దుస్థితి. పొలాల దగ్గరే పడుకునే రైతులు.. అర్ధరాత్రి పాముకాట్లు.. లోవోల్టేజీ కష్టాలు.. గంటలతరబడి పవర్‌కట్. ఆ దశాబ్దాల గోసను ఒక్కసారిగా తుడిచేసిండు కేసీఆర్. సాధించిన తెలంగాణను వెలుగుజిలుగుల రాష్ట్రంగా మలిచాడు. విద్యుదుత్పత్తిని పెంచాడు. అవసరమైన సంస్కరణలను తీసుకొచ్చాడు. కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు లేని రాష్ట్రంగా మలిచాడు. రెప్పపాటైనా కరెంటుపోని స్థాయికి తెలంగాణను నిలిపాడు.
(కొంటు మల్లేశం)
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో మగ్గిన తెలంగాణబిడ్డలు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెల్వని కరెంటు కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. వెలుగు దారులు చూపే నాథుడు లేక కుమిలిపోయారు. అప్రకటిత విద్యుత్తు కోతలు.. రాత్రిపూట కరెంటుతో అరిగోస పడ్డారు. పరిశ్రమలకు వారంలో రెండు మూడు రోజుల పవర్ హాలిడేలు ప్రకటించిన దుస్థితి. వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్.. ఆ వచ్చీరాని కరెంటు కోసం కటిక చీకట్లలో రైతుల పడిగాపులు! షాపులు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లల్లో డీజిల్ జనరేటర్ల మోతలు! లోవోల్జేజీ సమస్యలు, వ్యవసాయ మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం, కరెంట్ అందక.. పంటలకు నీరు పారక కండ్ల ముందు పంట ఎండుతుంటే కలతతో రైతుల ఆత్మహత్యలు..
ఇవీ నాటి సమైక్య పాలనలో తెలంగాణ చవిచూసిన విద్యుత్తు కష్టాలు! గ్రామాల్లో ఉదయం మూడు, సాయంత్రం మూడు గంటలు మాత్రమే త్రీ ఫేజ్ కరెంట్ వచ్చేది. రాత్రంతా సింగిల్ ఫేజ్ కరెంట్ అందిన రోజులవి. చివరికి అంత్యక్రియలకు స్నానాలు చేయలేని దుస్థితిని తెలంగాణ అనుభవించింది. ఇవే కాదు, బొగ్గు ఉండి కూడా థర్మల్ ప్లాంట్లు నిర్మించని.. విద్యుత్తు డిమాండ్‌కు తగినట్లు సబ్స్టేషన్లు, విద్యుత్తు లైన్ల నిర్మాణాలు చేపట్టని ఆనాటి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నకలుగా ఈ ప్రాంతం నిలిచింది. ఇవన్నీ స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదాయి. మన రాష్ర్టాన్ని మనం సాధించుకుంటేనే బాగుపడగలమన్న ఆలోచనను రేకెత్తించాయి.

కేసీఆర్ పాలనలో అసామాన్య విజయాలు
ఎట్టకేలకు స్వరాష్ట్రం సిద్ధించి ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాక ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలని, విద్యుత్తు కష్టాల నుంచి రాష్ర్టాన్ని బయటపడేయాలని, అన్ని రంగాలకు నిరంతర విద్యుత్తునందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టార్గెట్‌ను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేసింది. విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేసింది. ప్లాంట్ల నిర్మాణం, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, విద్యుత్తు పంపిణీ సరఫరా వ్యవస్థల విస్తరణ, సోలార్ విద్యుత్తు అభివృద్ధి దిశగా చకచకా అడుగులు వేసింది. స్వరాష్ట్ర ప్రదాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ క్రమక్రమంగా అద్భుత పురోగతి సాధించింది. కొద్ది కాలంలోనే జనరేటర్లు, ఇన్వర్టర్లు మాయమయ్యాయి. డీజిల్ జనరేటర్లు మూలనపడ్డాయి.
మోటర్ రీపేర్ సెంటర్లు మూతపడ్డాయి. విద్యుత్తులో కేసీఆర్ సృష్టించిన విప్లవం.. తెలంగాణకు వెలుగుల వైభవాన్ని అద్దింది. ఒకప్పుడు యంత్రాలు నడువాలంటే కరెంటు కోసం పక్కచూపులు చూసే స్థితి నుంచి కోతల్లేని స్థితికి తెలంగాణ విద్యుత్తు రంగం పురోగ మించింది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో కరెంట్ కోతలు దూరమయ్యాయి. పవర్ హాలిడేలు మాయమయ్యా యి. పరిశ్రమలకు భరోసా దొరికింది. పెట్టుబడిదారుల్లో దిలాసా నిండింది. మొ త్తంగా తెలంగాణను విద్యుత్తు ధగధగల్లో వెలిగించి ప్రపంచ పటంలో కేసీఆర్ జమానా ప్రకాశింపజేసింది. విద్యుత్తు కటకట స్థితి నుంచి స్వయంసమృద్ధిని సాధించడమే కాకుండా.. మిగులు విద్యుత్తు దిశగా ముందుకు సాగింది. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి విద్యుత్తు విజయాలు మొన్నటివరకూ అనేక రాష్ర్టాలకు కేస్ స్టడీస్‌గా మారాయి.

తెలంగాణ రాక ముందు కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో భగవంతునికెరుక! ఇయ్యాల ఇన్వర్టర్లు లెవ్వు.. స్టెబిలైజర్లు లెవ్వు..కన్వర్టర్లు లెవ్వు.. జనరేటర్లు మాయమైపోయినయ్. మోటర్ వైండింగ్ వర్క్‌షాపులన్నీ దివాలా తీసినయ్.. ఇయ్యాల మోటరు కాలది.. ట్రాన్స్ఫార్మర్ కాలది.. ఎవల ఇంట్ల బుగ్గ కాలది.. 24 గంటలు ప్రతి ఒక్క రంగానికీ అత్యంత నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణనే. కరెంట్ వాడేదాంట్లో.. తలసరి విద్యుత్తు వినియోగంలో ఒకనాడు భారత దేశంలో కటకటపడ్డ తెలంగాణ.. ఇయ్యాల దేశంలోనే నవంబర్ వన్ రాష్ట్రమని గర్వంగా మీకు తెలియజేస్త ఉన్న..
-నాడు ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
కొత్తవి ప్రారంభించి.. కోతలను అధిగమించి
కరెంట్ కష్టాలను అధిగమించడం.. లోటు ను పూడ్చడంలో భాగంగా కేసీఆర్ సర్కార్ మిషన్మోడ్తో పని చేసింది. గత ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ ప్రైవేట్ రంగంలో విద్యుత్తు ఉత్పాదకతను ప్రోత్సహిస్తే కేసీఆర్ హయాంలో ప్రభుత్వ రంగంలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ప్లాంట్లను పెద్ద ఎత్తున వినియోగంలోకి తెచ్చింది. అనేక పెండింగ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను మెరుపు వేగంతో పూర్తిచేసింది. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో 600 మెగావాట్లు, దిగువ జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్ల ప్లాంట్లను వినియోగంలోకి తెచ్చింది. ఇక దేశంలోనే తొలిసారిగా రికార్డు సమయంలో 48 నెలల్లోనే పాల్వంచ-కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (స్టేజ్-7)లో 800 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను వినియోగంలోకి తెచ్చింది.
ఇదో రికార్డుగా చెప్పవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను మెరుపువేగంతో పూర్తిచేసింది. ఒకోటి 270 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లను ప్రారంభించింది. నల్లగొండ జిల్లా దామరచర్లలో టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పుడు ఈ నాలుగు వేల మెగావాట్ల ప్లాంటే రాష్ర్టానికి వరప్రదాయినిగా మారింది. భద్రాద్రి ప్లాంటు కూడా ఆపదలో ఆదుకుంటున్నది. బీటీపీఎస్, వైటీపీఎస్లే నేడు రాష్ర్టానికి విద్యుత్తు వెలుగులందిస్తున్నాయి. జెన్కో రోజుకు సగటున 100 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుండగా, భద్రాద్రి నుంచి 17 మిలియన్ యూని ట్లు, యాదాద్రి నుంచి 30 మిలియన్ యూనిట్ల విద్యుత్తు రాష్ర్టానికి అందుతున్నది. అంటే దాదాపు సగం విద్యుత్తును ఈ రెండు ప్లాంట్లే అందిస్తున్నాయి.
తలసరి వినియోగమే తార్కాణం
ప్రగతి సూచికల్లో తలసరి విద్యుత్తు వినియోగం కూడా ఒకటి. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే. 2021-22 నాటికి అది 2,140 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటును పరిశీలిస్తే 1,255 యూనిట్లు మాత్రమే. అంటే తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం, జాతీయ తలసరి వినియోగం కన్నా 70 శాతం ఎకువ. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే 944 యూనిట్లు ఎక్కువ. జాతీయ వినియోగంతో పోల్చితే 871 యూనిట్లు అధికం. అంతలా తెలంగాణ విద్యుత్తు రంగం ఎగబాకింది. విద్యుత్తు రంగంలో కేసీఆర్ సర్కార్ సృష్టించిన విప్లవానికి ఇదే నిదర్శనం. 60 ఏండ్ల సమైక్యపాలనలో సాధ్యంకాని ఉత్పత్తి కేంద్రాలు, సబ్స్టేషన్లు, లైన్లు నిర్మించిన ఫలితంగా తలసరి విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది.
నెట్వర్క్ విస్తరణ కేసీఆర్ చలవే
ఈ రోజు 19వేల మెగావాట్ల పీక్ డిమాండ్ ను అధిగమిస్తూ 340 మిలియన్ యూనిట్ల వి ద్యుత్తును రాష్ట్రం సరఫరా చేయడం కేసీఆర్ చలవే. లోడ్ పెరిగినా పీక్ డిమాండ్ రికార్డుల మోత మోగినా సరఫరా చేస్తున్నారంటే కేసీఆర్ వేసిన పునాదులపైనే. విద్యుత్తు రంగం బలోపేతం, కరెంట్ సరఫరా, పంపిణీ వ్యవస్థల మె రుగుకు నాటి ప్రభుత్వం రూ.39,321 కోట్లు ఖర్చుచేసింది. ట్రాన్స్మిషన్ నెట్వర్క్ బలోపేతానికి రూ.18,874 కోట్లు వెచ్చించింది. పంపిణీ నెట్‌వర్క్‌ను పెంచడమే లక్ష్యంగా పనిచేసింది. పల్లెప్రగతిలో రూ.506 కోట్లు, పట్టణ ప్రగతిలో రూ.249 కోట్లను కేవలం గ్రామీణ, అర్బన్ విద్యుత్తు వ్యవస్థలను మెరుగుపరిచేందుకు వెచ్చించింది. 2023లో పీక్ డిమాండ్ 15,497 మెగావాట్లు మాత్రమే. 2025లో 15,906 మెగావాట్లు మాత్రమే. 2026కు వచ్చేసరికి 19,892 మెగావాట్లకు చేరింది. కాంగ్రెస్ సర్కార్ ఒక్క కొత్త సబ్‌స్టేషన్‌ను కూడా నిర్మించలేదు. కొత్త లైన్లను విస్తరించలేదు. కేసీఆర్ నిర్మించిన వ్యవస్థలనే వాడుకుని విద్యుత్తును సరఫరా చేస్తున్నది.

నిరంతర శ్రమ ఫలితమే
ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ విద్యుత్తు రంగంపై నిరంతరం సమీక్షలు నిర్వహించేవారు. రోజువారీగా స్వయంగా తానే పర్యవేక్షించేవారు. విద్యుత్తు రంగాన్ని రాష్ర్టాభివృద్ధికి జీవనాడిలా భావించి ఈ రంగం ప్రగతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం విద్యుత్తు కోతల నుంచి నిరంతర వెలుగులకు బాటలు వేశారు. విద్యుత్తు రంగం – సాగునీటి ప్రాజెక్ట్‌లపై సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయంలో ఓ డ్యాష్‌బోర్డు ఉండేది. విద్యుత్తు సరఫరా.. ఉత్పత్తి స్థితిపై కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీసేవారు. అధికారులను అప్రమత్తం చేసేవారు. జలాశయాల్లో నీటి మట్టాన్ని బట్టి హైడల్ విద్యుత్తు ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలిచ్చిన దాఖలు అనేకం ఉన్నాయి. ఫలితంగా అనతికాలంలోనే లోటు విద్యుత్తును సైతం రాష్ట్రం అధిగమించింది. నిరంతర ప్రయత్నాల ఫలితంగా నిరంతర విద్యుత్తునందించే స్థాయికి చేరింది. రాష్ట్రం ఏర్పడ్డ ఏడాదిలోపే అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తునందించింది. 2017 జూలైలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. 2017 డిసెంబర్ 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సాగుకు ఉచిత విద్యుత్తు విప్లవం మొదలైంది. మొత్తం వినియోగంలో 33 శాతం వ్యవసాయ రంగమే వినియోగించినా కేసీఆర్ సర్కార్ సాగుకు ఉచిత విద్యుత్తునివ్వడంలో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు.
నేషనల్ గ్రిడ్ అనుసంధానం
వార్ధా-డిచ్పల్లి 765 కేవీ డబుల్ సర్క్యూ ట్ విద్యుత్తు లైన్ తెలంగాణను నేషనల్ గ్రిడ్‌తో అనుసంధానించే అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఈ లైన్‌తో తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్తును దీర్ఘకాలికంగా పొందే హక్కు లభించింది. అంతేకాకుండా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కరెంట్ తీసుకునే సౌలభ్యం ఈ లైన్ ద్వారా ఏర్పడింది. 2018 మే కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టింది. కానీ కేసీఆర్ సర్కార్ ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలని కోరింది. అడ్డంకులను తొలగించింది. భూ సంబంధిత సమస్యల పరిష్కారం, అధికారులతో సమన్వయం చేయడం ద్వారా సహకరించింది. ఫలితంగా నిర్దేశిత గడువుకన్నా 13 నెలల ముందే అంటే మార్చి 30, 2017 నాటికే ఈ లైన్ అందుబాటులోకి వచ్చింది. విద్యుత్తు కోతలను నివారించడం, నిరంతరరాయంగా విద్యుత్తునందించేందుకు ఈ లైన్ దోహదపడింది. ఇక వరోరా – వరంగల్ పీజీసీఐఎల్ లైన్ నిర్మాణానికి సైతం కేసీఆర్ సర్కార్ తోడ్పాటునందించింది.
సీఎండీలుగా నిష్ణాతులు
విద్యుత్తు సంస్థలకు సీఎండీలుగా ఆయా రంగాల్లో నిష్ణాతులకే కేసీఆర్ సర్కార్ అవకాశం కల్పించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఐఏఎస్‌లను విద్యుత్తు సంస్థల సీఎండీలుగా నియమించడం ఆనవాయితీగా వస్తున్నది. కొన్ని పోస్టులైతే పునరావాసం కల్పించేందుకు వాడుకున్న సందర్భాలున్నాయి. అయితే ఐఏఎస్‌లు తరుచూ బదిలీలు కావడం.. కొత్త వారు రావడంతో విద్యుత్తు రంగ పురోభివృద్ధికి ఆటంకంగా మారింది. ఈ విధానానికి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ముగింపు పలికింది. విద్యుత్తు రంగంలో పనిచేసిన నిపుణులనే అధిపతులుగా నియమించింది. కేసీఆర్ సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి నియామకం జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్రావుదే కావడం గమనార్హం. అంటే విద్యుత్తు రంగంపై కేసీఆర్ ఎంత శ్రద్ధ వహించేవారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల సీఎండీలు, డైరెక్టర్లుగా అనుభవజ్ఞులు, నిష్ణాతులను నియమించింది. ఇక విద్యుత్తు సంస్థలకు అవసరమైన ఉద్యోగులను నియమించి జవసత్వాలు నింపింది. 22 వేల మంది ఆర్టిజన్ కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్ చేసింది. 4 వేల మంది జేఎల్ఎంలు, ఏఈలు, సబ్ ఇంజినీర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు అన్నీ కలిపి మొత్తంగా 10 వేల మంది ఇంజినీర్లు, ఉద్యోగులను నియమించింది.
ధాన్యాగారంగా తెలంగాణ
‘సంపదను పెంచాలి.. పేదలకు పంచాలి’.. ఇది కేసీఆర్ సర్కార్ అనుసరించిన సంక్షేమ విధానం. ఈ నినాదాన్ని కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో అక్షరాలా నిజం చేసి చూపించింది. రాష్ట్ర సమ్మిళితాభివృద్ధికి దోహదపడే అన్ని రకాల విద్యుత్తు వినియోగదారులకు సబ్సిడీలను విజయవంతంగా అందించింది. అక్షరాలా 72.41 లక్షల మంది సబ్సిడీల ద్వారా లబ్ధిపొందారు. ఏటా విద్యుత్తు సబ్సిడీగా అందించిన మొత్తం రూ.50 వేల కోట్లు. రాష్ట్రంలో మొత్తం 27,48,598 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్యుత్తునందించింది.

వ్యవసాయ రంగానికి నిరంతరం కరెంట్ సరఫరా చేయడంతో భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ నిలిచింది. ఇక వ్యవసాయానికి సాగునీటినందించే లక్ష్యంతో భారీ బహుళార్థసాధక ఎత్తిపోతల పథకాలను కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి వంటి ప్రాజెక్ట్‌లు నిర్మించింది. ప్రాజెక్ట్‌లను నిర్మిస్తేనే సరిపోదు, వాటికి సరిపడా విద్యుత్తునందించాలి. నీళ్లు ఎత్తిపోసేందుకు, మోటర్లు నడిపేందుకు ప్రాజెక్ట్‌ల వద్ద 6,435 మెగావాట్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థలు, సబ్స్టేషన్లు నిర్మించింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల కోసం 6,454 మెగావాట్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల కోసం 820 మెగావాట్ల డిమాండ్‌కు ప్రణాళికలు రూపొందించింది.
క్యూకట్టిన పరిశ్రమలు
రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే విద్యుత్తు కోతలను అధిగమించిన తెలంగాణ.. అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా అవతరించింది. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, వ్యాపార రంగాలకు కేసీఆర్ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును అందించింది. 2014లో 7,778 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యం 2023 నాటికి 18,567 మెగావాట్లకు చేరింది. విద్యుత్తు సరఫరా వ్యవస్థలను సైతం ప్రభుత్వం బలోపేతం చేసింది.

ఉత్పత్తి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ఈ తొమ్మిదిన్నరేండ్లలో రూ.97,321 కోట్లు వెచ్చించింది. రాష్ట్రం అందిస్తున్న నిరంతర విద్యుత్తుకు ఆకర్షితమై పారిశ్రామిక రంగం తెలంగాణకు క్యూ కట్టింది. పెట్టుబడులు వెల్లువెత్తాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ను తమ డెస్టినేషన్‌గా మార్చుకున్నాయి. 2014లో రూ.57 వేల కోట్లున్న తెలంగాణ ఐటీ ఎగుమతులు..2023 నాటికి రూ.2.68 లక్షల కోట్లకు పెరిగాయి. ఉద్యోగాల కల్పన జరిగింది. ఉద్యోగావకాశాలు పెరిగాయి. దీనికంతటికీ ప్రధాన కారణం నిరంతర విద్యుత్తే.
2014లో 2,700 మెగావాట్ల లోటు
స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత కరెంట్ లెక్కలు తీస్తే 2,700 మెగావాట్ల లోటుగా తేలింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం విద్యుత్తు కేటాయింపు జరిగింది. కేటాయించిన ఈ విద్యుత్తు ఏ మాత్రం సరిపోని పరిస్థితి. పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా ఉంటే పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో 460 మెగావాట్ల లోయర్ సీలేరు విద్యుత్తు కేంద్రం ఆంధ్రాకు వెళ్లిపోయింది. తెలంగాణ వాటాగా అందాల్సిన విద్యుత్తు అందకుండా పోయింది. ఈ తరుణంలో ఏపీ దొంగ దెబ్బతీసింది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి 1,500 మెగావాట్ల విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది. గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి విద్యుత్తు రాకపోవడంతో 900 మెగావాట్ల లోటు ఏర్పడింది. 2014లో తెలంగాణలో విద్యుత్తు లోటు 2,700 మెగావాట్లుగా తేలింది.
సింగరేణి నుంచి వెలుగులు
రామగుండంలోని నేషనల్ థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీసీ) నిర్మాణాన్ని అప్పటి సర్కార్ శరవేగంగా పూర్తిచేసింది. 1200 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్‌లో రెండు యూనిట్లున్నాయి. ఈ ప్లాంట్‌లో 2016 సెప్టెంబర్‌లో యూనిట్ -1 నుంచి, 2016 డిసెంబర్లో యూనిట్ -2 నుంచి కమిషనింగ్ (ఉత్పత్తి) ప్రారంభమైంది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు 2016 -23 వరకు 58,556 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఈ ప్లాంట్ ఉత్పత్తిచేసి, 55,034 మిలియన్ యూనిట్లను రాష్ర్టానికి సరఫరా చేసింది.

800 మెగావాట్ల మరో థర్మల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభమైంది. సింగరేణి వ్యాప్తంగా 300 మెగా సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే వీటిలో 224 మెగావాట్లను గ్రిడ్‌కు అనుసంధానించారు. జలాశయాల్లో తేలియాడే 350 మోగావాట్ల సోలార్ప్లాంట్లను సైతం సింగరేణి సంస్థ ఏర్పాటు చేస్తున్నది. సింగరేణి థర్మల్‌ప్లాంట్ నుంచి రోజుకు గరిష్ఠంగా 26 మిలియన్ యూనిట్లు, కనిష్ఠంగా 13 మిలియన్ యూనిట్ల విద్యుత్తు రాష్ర్టానికి అందుతున్నది.
పవర్ ఐలాండ్‌గా హైదరాబాద్
విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కేసీఆర్ సర్కార్ హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా తీర్చిదిద్దింది. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, రక్షణ రంగ సంస్థలు, రీసెర్చ్ సంస్థలు, వాణిజ్య కార్యకలాపాలకు నిరంతరాయ విద్యుత్తునందించే గొప్ప ప్రయత్నమిది. దీంట్లో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ వలయాకారంలో విద్యుత్తు లైన్లు వేసింది. విద్యుత్తు అంతరాయం తలెత్తకుండా.. కరెంట్ వ్యవస్థలను అనుసంధానించింది. గ్రిడ్ విఫలమైనా.. ఒక వేళ ఏదైనా సమస్య వస్తే ఎక్కడి నుంచైనా విద్యుత్తును తీసుకునే వ్యవస్థను నిర్మించింది. 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ స్థాయిల్లో ఆధునిక రింగ్ మెయిన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

