హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని కోరింది. రెండో దశ పర్యావరణ అనుమతులపై మంగళవారం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన నిపుణుల కమిటీ (ఈఏసీ) సమావేశం జరిగింది. ఈఏసీ చైర్మన్ డాక్టర్ కే గోపకుమార్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ (జనరల్) సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, నాగర్‌కర్నూల్ సీఈ హమీదాఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. కృష్ణా బేసిన్‌లోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగు, సాగునీటిని అందించడానికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని చెప్పారు. తొలిదశకు ఇప్పటికే అనుమతులు రావడంతో 1,226 గ్రామాలతోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. రెండో దశలో 6 జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రెండో దశ పర్యావరణ అనుమతులకు 2017 అక్టోబర్ 11న టీవోఆర్ జారీ అయిందని, 2021 ఆగస్టు 10న ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిందని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను నిరుడు సెప్టెంబర్‌లో సీడబ్ల్యూసీకి సమర్పించామని, ఈ ఏడాది మార్చి 17న కేంద్ర విద్యుత్తు సంస్థ (సీఈఏ), జూన్ 5న సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) క్లియరెన్స్‌లు ఇచ్చాయని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, కరువుతో ప్రజలు వలస వెళ్లే దుస్థితిని నిరోధించేందుకు వీలుగా రెండో దశకు త్వరగా అనుమతులు ఇవ్వాలని రజత్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.